
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జలవనరులన్నీ పొంగిపొర్లుతున్నాయి. గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు కర్ణాటక ప్రాంతం నుంచి వస్తున్న వరదతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరద ప్రవాహానికి సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వనదుర్గా (ఘనపుర్) ప్రాజెక్టు, మంజీరా ప్రాజెక్టులు ఉరకలు వేస్తున్నాయి. ఆయా ప్రాజెక్టుల వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. చెరువులు, కుంటల వద్ద సందర్శకులు కేరింతలు కొడుతూ ఈతకొడుతున్నారు.
జల దిగ్బంధంలోనే ‘వనదుర్గమ్మ’
పాపన్నపేట, సెప్టెంబర్ 29: ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయం వారం రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సైతం రాజగోపురంలోనే దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం సింగూరు ప్రాజెక్టు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వనదురా ్గప్రాజెక్టు నుంచి (ఘనపూర్ ఆనకట్ట పైగా) నిజాంసాగర్ వైపు పరుగులు తీసింది. అమ్మవారి ఆలయం ఎదుట గల బ్రిడ్జి వరద నీటితో పర్యాటక కళను సంతరించుకున్నది. భక్తులు నదీ ప్రవాహం వైపునకు వెళ్లకుండా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
‘సింగూరు’ చిందులు..! ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
పుల్కల్ రూరల్, సెప్టెంబర్ 29: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. రెండు రోజులుగా ఐదు గేట్లు, రెండు మీటర్లు వరకు ఎత్తిన నీటిపారుదలశాఖ అధికారులు వరద తీవ్రతను బట్టి దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో ఎక్కువగా వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం ప్రాజెక్టులో 27.148 టీఎంసీల నీటినిల్వ ఉండగా, క్రెస్ట గేట్ల ద్వారా 62,104 క్యూసెక్కులు, జెన్కో 2121 క్యూసెక్కులు, కెనాల్స్ 140 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్ 80 క్యూసెక్కు లు, ఎంబీ 70 క్యూసెక్కులు, ఈవీపీ లాస్ 300 క్యూసెక్కులు మొత్తంగా 64,815 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డీఈ నాగరాజు తెలిపారు.