
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో నెలరోజులు శిక్షణ
ఎస్బీఆర్ఎస్ఈఐటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్
మెదక్, ఆగస్టు 26 : స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మెదక్‌లో నెల రోజులపాటు మగ్గం వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఆర్ఎస్ఈఐటీ డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్‌లోని మహిళా సమాఖ్యలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శిక్షణకు 18 నుంచి 45 ఏండ్లలోపు మహిళలు అర్హులన్నారు. అభ్యర్థి పేరు, ఆధార్ కార్డు, ఫొటో, రేషన్ కార్డు, ఆదాయం, విద్యార్హత, కోరుకునే శిక్షణ పేరు, ఫోన్ నంబర్, ప్రస్తుతం ఏం చేస్తున్నారన్న వివరాలు తెలియజేసి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం డీపీఎం మోహన్ మాట్లాడుతూ అభ్యర్థులకు చదవడం, రాయడం వచ్చి ఉండాలన్నారు. ఉచిత శిక్షణకు మెదక్ పరిసరాల్లో ఉన్న గ్రామీణ పేద మహిళలు అర్హులన్నారు. వృత్తి నైపుణ్యంతోపాటు భావ, వ్యక్తీకరణ, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందించే సాప్ట్ స్కిల్స్ కూడా నేర్చుకునే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 31వ తేదీలోపు డీఆర్డీఏ డీపీఎం మోహన్, సంగారెడ్డి బైపాప్ రోడ్డులోని వెలుగు ఆఫీస్ పక్క గల ఎస్బీఆర్ఎస్ఈటీఐ కార్యాలయంలో 08452-271321, 9490103390,9704446956, 94901 29839 నంబర్లకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 లోపు ఫోన్ చేసి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఆసక్తి గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వేణుగోపాల్‌రావు, సంస్థ ఫ్యాకల్టీ నర్సింహులు పాల్గొన్నారు.