
మెదక్/మెదక్ మున్సిపాలిటీ/మెదక్ రూరల్/ కొల్చా రం/ వెల్దుర్తి/చిన్నశంకరంపేట/పెద్దశంకరంపేట/నర్సా పూర్/ పాపన్నపేట, అక్టోబర్ 16 : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పర్వదిన వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో ప్రజలు ఘనం గా జరుపుకొన్నారు. ఆనందోత్సవాల మధ్య దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. వాడవాడలా శమి వృక్షాలకు, జమ్మి కొమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరికొకరు జిమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో దైవ దర్శనాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవ కమిటీ, మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ వధకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో కళాశాల మైదానం జనసంద్రంగా మారింది. రావణ ప్రతిమ దహనం, వివిధ రకాల పటాకులు వెలుగులు అందరిని మంత్ర ముగ్దుల్ని చేశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరై రావణ దహనాన్ని గావించారు. ఈ ఉత్సవాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, ఆంజనేయులు, శ్రీనివాస్, సుంకయ్య, వనజ, యశోధ, రుక్మిణి, లలిత, లక్ష్మి ఉత్సవ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిర్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్తోపాటు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మూడు నెలల్లో కలెక్టరేట్ ప్రారంభం…
రాబోయే మూడు నెలల్లో నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుందామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పిల్లికోటాల్ వద్ద నిర్మిస్తున్న వెయ్యి డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయని, త్వరలోని నిరుపేదలైన అర్హులకు పంపిణీ చేస్తామని తెలిపారు.