
హోతి బస్వరాజ్ లోకల్ టాలెంట్
చిత్ర, శిల్పకళలో రాణిస్తూ .. ఎందరికో ఉపాధి
అందమైన కళాఖండాలు
జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు
న్యాల్కల్, ఆగస్టు 11 : బండరాళ్లకు సైతం ప్రాణం పోయగల చేతులు ఆ యువ శిల్పకారుడివి. చిత్ర, శిల్పకళపై ఉన్న ఆసక్తితో శిల్పకళను ఎంతో ప్రావీణ్యంగా మలుచుకున్నారు. ఎప్పటికైనా ప్రముఖ చిత్ర, శిల్పకారుడిగా పేరు సంపాదించాలని కలలుకన్నాడు. ఆ కలలను నిజం చేసుకుని చిత్ర, శిల్పకళలో రాణించి ఎన్నో అవార్డులు సాధించగలిగాడు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు హోతి
బస్వరాజ్.
ఇదే శిల్పకళలో ఎందరికో ఉపాధిని కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తండ్రి అడివప్ప, అన్నయ్య ప్రకాశ్ చిత్రలేఖనంలో కళాకారులు. వారి ప్రోద్బలంతోనే బస్వరాజ్ చిన్నతనంలోనే పొలాలకు వెళ్లినప్పుడు చూసిన పక్షులను మట్టితో తయారీ, బొమ్మలను వేయడం నేర్చుకున్నాడు. అందుబాటులో ఉన్న వస్తువులను సేకరించి అందమైన రూపాలుగా మలచడం బాల్యం నుంచే అలవాటుపడింది. బస్వరాజ్ ప్రతిభను గుర్తించిన రోటరీ క్లబ్, స్వచ్ఛంద సంస్థలు, స్నేహితులు ఎప్పటికప్పుడు నగదు ప్రోత్సాహకాలు అందించారు. పదో తరగతి వరకు న్యాల్కల్లో, ఇంటర్ వికారాబాద్, టీటీసీ డ్రాయింగ్ కోర్సు చేశాడు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీ పరీక్షను రాశాడు. ఇష్టమైన చిత్రకళ విభాగానికి బదులుగా శిల్పకళ కోర్సుల్లో సీటు సాధించాడు. నాలుగేండ్ల కోర్సును పూర్తి చేసి బం గారు పతాకాన్ని సాధించారు. జేఎన్టీయూలో శిల్పకళ కోర్సు చేస్తున్న సమయంలోనే తయారు చేసిన కళాఖండాలతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రదర్శనలను ఇచ్చాడు. జాతీయ స్థాయిలో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, అమృత్సార్, అహ్మదాబాద్‌లో చేసిన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
సందేశాత్మక శిల్పాలు
దేశంలోని పలు రాష్ర్టాల్లో నిర్వహించిన ప్రదర్శనలో బస్వరాజ్ తయారు చేసిన శిల్పాలు సందేశాత్మకంగా నిలుస్తున్నాయి. భూ ప్రాళయానంతరం మిగిలిన జీవరాశుల పరిస్థితి, కాలుష్యంతో మానవాళి కలిగే విపత్తు, గిరిజనులు వేషధారణ, జీవనశైలి, ఆహార అలవాట్లు, ఖైదీ, వర్షాల కోసం ఎదురుచూపులు, లవర్స్ గ్యారేజీ, వేటాడుతున్న బాల్యం. కాలుష్య కొరలో అడవితల్లి వంటి సందేశాత్మక శిల్పాలు ప్రముఖుల మన్నలను పొందాయి. రాళ్లు, కర్రలు, ఇనుము, కంచు, సిమెంట్, సున్నంతో తయారు చేసిన విగ్రహాలు దేశంలో గుజరాత్, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, విశాఖపట్టణం, జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దేశ, రాష్ట్ర నాయకులు, ప్రముఖులు, దేవతలు, జంతువులు, పక్షులు తదితర అందమైన విగ్రహాలను బస్వరాజ్ సృజించినవే. మూగజీవులపై బస్వరాజ్‌కు అమితమైన ప్రేమ..వాటిపై లఘు చిత్రాన్ని తీశారు. ప్రతి ఏడాది సొంత గ్రామమైన న్యాల్కల్ శివారులో జరిగే ఉర్సె షరీఫ్ పీర్ గైబ్సాహెబ్ దర్గాలో జరిగే పశువుల సంతలో ఉత్తమ పశుపోషకులకు దివంగత తల్లిదండ్రుల పేరిట అవార్డులను అందజేస్తున్నాడు.
ప్రతిభకు పురస్కారాలు
2002లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన హైలీ కమాండబుల్ అవార్డును లభించింది.
2005లో బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయిలో స్టోన్ ఆర్ట్స్ క్యాంప్‌లో ప్రథమ బహుమతిని సాధించాడు.
న్యాల్కల్ ప్రాంతంలో లభించే ఎర్రరాయితో చేసిన కళాఖండానికి 2005లో రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సుశీల్‌కుమార్ షిండే చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు.
2007లో రాష్ట్ర స్థాయిలో శిల్పకళ పోటీల్లో ప్రభు త్వం తరఫున చిత్రమయి అవార్డును గెలుచుకున్నారు. 2015లో ఉత్తమ శిల్పకారుడిగా తెలంగాణ ప్రభుత్వం అందజేసిన అవార్డును పొందారు.
2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రదర్శనలో అజంతా కళారామం ఆధ్వర్యంలో జాతీయ అవార్టును పొందారు.
ఇటీవల కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ పోటీలో (కేసీఆర్-టేకీవీ) నాలుగు అడుగుల విగ్రహం ముందు భాగంలో కేసీఆర్ ముఖం, వెనుక భాగంలో తల వెంట్రుకలో వివిధ పథకాల అకులతో కల్పవృక్షాన్ని తయారు చేసి గుర్తింపు పొందాడు.
అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం..
చిత్ర, శిల్పకళతో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నదే నా లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలను ఇచ్చా. వాటికి తగట్టుగా అవార్డులు సాధించా. అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనల కోసం కళాకృతులను రూపొందించేలా కృషి చేస్తున్నా. చిత్ర, శిల్పకళలో ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నా వంతు కృషిచేస్తా. మరికొంతమంది కళాకారులకు ఉపాధిని కల్పిస్తున్నా. చిత్ర, శిల్పకళ రంగంలో డాక్టరేట్ సాధించేందుకు మరింత రాణించేలా శాయశక్తులా కృషి చేస్తా.
-హోతి బస్వరాజ్, ప్రముఖ శిల్పకారుడు