
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆయా ఆలయాలు, మండపాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. ఏడుపాయల వనదుర్గమ్మ ఆదివారం కూష్మాండ రూపంలో భక్తులకు దర్శనమివ్వగా, పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.
గుమ్మడిదల, అక్టోబర్ 10 : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వంశపారపర్యంకులు కేవీ.నర్సింహా చార్యులు, కేవీ.రంగనాథ చార్యులు వేదపండితుల మధ్య కల్యాణ మంత్రోచ్ఛరణలతో స్వామి వారి కల్యాణాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకీసేవలో ఎదుర్కోళ్లు నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్ మొగులయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోచుగారి శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, ధర్మకర్తలు సూర్యనారాయణ, కాలకంటి రవీందర్‌రెడ్డి, ఇందెల బాల్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రవణ్‌రెడ్డి పాల్గొన్నారు.
చేర్యాల, అక్టోబర్ 10 : కొమురవెల్లి మల్లికార్జున క్షేత్రంలో ఆదివారం స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకొని, మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కటేసి పూజలు నిర్వహించారు. పూజల్లో ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ధర్మకర్తలు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.