
పరిపాలనా సౌలభ్యానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆయా జిల్లా కేంద్రాల్లో జనాభా పెరగడంతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇందుకు తగ్గట్లుగానే పట్టణ కేంద్రాల్లోని ప్రధాన రహదారులపై రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు. మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణ కేంద్రంలో ప్రధాన రోడ్లపై నాలుగు చోట్ల చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుతో ట్రాఫికర్‌కు చెక్ పెట్టారని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కానున్నాయి. దీంతో మెదక్ పట్టణంలో జఠిలమైన ట్రాఫిక్ సమస్యకు తెరపడనున్నది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ప్రతిపాదనలు పంపగా, కలెక్టర్ హరీశ్ పట్టణంలోని చౌరస్తాల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి రూ.14లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో మెదక్ పట్టణంలో బోధన్-రామాయంపేట చౌరస్తా వద్ద, హెడ్ పోస్టాఫీస్ చౌరస్తాలో, పట్టణంలోని రాందాస్ చౌరస్తా, మెదక్-చేగుంట చౌరస్తాలో ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు కానున్నాయి.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మెదక్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పట్టణాన్ని సుందరీకరణ దిశగా మార్చడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని చౌరస్తాల వద్ద ట్రాఫిక్‌కు నియంత్రణకు సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని నాలుగు చౌరస్తాల వద్ద ఫౌంటెన్ల ఏర్పాటుతో పాటు అందంగా తీర్చిదిద్దనున్నారు. ప్రధాన రహదారి మధ్యలో డివైడర్ల వద్ద చెట్లను పెంచుతున్నారు. దీంతో మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పిల్లికోటల్ వరకు మెదక్ పట్టణం అందంగా కనపడుతున్నది. మెదక్-చేగుంట చౌరస్తా నుంచి మంభోజిపల్లి వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లలో మొక్కలు నాటుతున్నారు. మెదక్ పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్నది.
మెదక్ జిల్లా కేంద్రంలో రోజురోజుకూ జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతున్నది. వాహనచోదకులు రాంగ్రూట్లో ప్రయాణించడం, మితిమీరిన నిర్లక్ష్యం, వేగంగా వాహనాలు నడపడంలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ పట్టణంలో ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు కానుండటంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యకు తెరపడనున్నది. మెదక్ జిల్లాలో లక్షా 31వేల 814 రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనాలు ఉన్నాయి. అందులో అత్యధికంగా 88,730 ద్విచక్రవాహనాలుండగా, వ్యవసాయ ట్రాక్టర్లు 6,347, వ్యాపార నిర్వహణ ట్రాక్టర్లు 4104, గూడ్స్ వాహనాలు 899, మోటర్ కార్లు 9658, మోటర్ క్యాబ్స్ 789, ఓమ్నీ బస్సులు 438, గూడ్స్ క్యారేజ్‌లు 4535, మ్యాక్సీ క్యాబ్‌లు 286, విద్యాసంస్థల బస్సులు 370, హార్వేస్టర్లు 509, ఆటో రిక్షాలు 8203, త్రిచక్రగూడ్స్ వాహనాలు 899, లగ్జరీ టూరిస్ట్ క్యాబ్స్ 38 వీటితో పాటు తదితర వాహనాలున్నాయి.
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని నాలుగు చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు కానున్నది. అతి త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తాం. జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు సిగ్నల్స్ వ్యవస్థ దోహదపడుతున్నది. పట్టణంలోని నాలుగు చౌరస్తాల వద్ద మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. చౌరస్తాల వద్ద ఫౌంటెన్లు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దుతాం.