
మెదక్, అక్టోబర్ 8 : నిత్యావసర ధరలు రోజురోజకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,98,358 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 16 ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో గ్యాస్ సిలిండర్ ధర రూ.773.50 ఉండగా, సెప్టెంబర్ నాటికి రూ.954కి పెంచారు. తాజాగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.972గా నిర్ణయించారు. సిలిండర్ తీసుకున్న తర్వాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేస్తున్నారు. కరోనాకు ముందు ఒక సిలిండర్‌పై రూ.280 రాయితీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. గతంలో నెల నెలా గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుండగా, సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వినియోగదారులు వాపోతున్నారు.
పెరిగిన గ్యాస్ ధర..
వంట గ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. చమురు సంస్థల నిర్ణయం మేరకు ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.15 పెరగడంతో ధర రూ.972కు చేరింది. దీనికి తోడు స్థానిక నిర్వాహకులు ట్రావెల్, ఇతరచార్జీల కింద రూ. 30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఫిబ్రవరి 15 నాటికి రూ.840 ఉన్న వంట గ్యాస్ ధర ఎనిమిది నెలల్లో ఏకంగా రూ. 132కు పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇది లా ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. 2020 అక్టోబర్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.84.41 ఉండగా, డీజిల్ రూ.77.05 ఉండేది. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.107.50కు పెరిగింది. డీజిల్ ధర రూ.100. 22కు పెరిగింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.