
బతుకమ్మ అంటేనే పూల పండుగ.. ప్రకృతి సహజ సిద్ధమైన పూలతో మహిళలు బతుకమ్మను తయారు చేసి కొలుస్తారు. ఇందుకోసం ప్రధానంగా తంగేడు పూలను ఉపయోగిస్తారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మొదలు ఈ పూల కోసం ప్రజలు పోటాపోటీన అడవి బాట పట్టేవారు. అడవులు అంతరించి పోడంతో తంగేడు పూలు కరువవుతుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న హరితహారం పూల పండుగకు వరంలా మారింది. హరిత హరంలో భాగంగా తంగేడు మొక్కలను పంపిణీ చేయడంతో ఇప్పుడు ఇండ్ల ముంగిటే తంగేడు పూలు లభిస్తున్నాయి. పండుగకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా మహిళలు ఈ పూలను తీసుకెళ్లి బతుకమ్మను తయారు
చేసుకుంటున్నారు.
మద్దూరు, అక్టోబర్ 7 : తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ వచ్చిందంటే తంగేడు పూలు గుర్తొస్తాయి. బతుకమ్మను పేర్చేందుకు తీరొక్కపూలలో తంగేడు పూలు ఎంతో ప్రధానమైనవి. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు తంగేడు పువ్వుతో బతుకమ్మను పేర్చాల్సిందే. అంతటి ప్రాము ఖ్యం కలిగిన ఈ పూల కోసం చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా తంగేడు పూల వేట కోసం అడవి బాట పట్టేవాళ్లు. రోజురోజుకూ అడవులు అంతరించిపోతుండడంతో పాటు పాడుబడిన భూములన్నీ సాగులోకి వస్తుండడంతో తంగేడు చెట్లు అంతరించిపోయాయి. దీంతో తంగేడు పూల సమస్య ఏర్పడింది. చేసేదేమీ లేక గ్రామాల్లో కాగితపు పువ్వుల (పేపర్తో చేసిన) బతుకమ్మలను తయారు చేసి ఆడే పరిస్థితి నెలకొన్నది.
ఇండ్ల ముంగిటే తంగేడు వృక్షాలు..
హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా కొన్నేండ్లుగా ప్రభుత్వం ఇంటింటికీ తంగేడు మొక్కల పంపిణీ చేపట్టింది. ప్రజలు తమ ఇండ్ల ముందు తంగేడు మొక్కలను నాటారు. రోడ్లకు ఇరువైపులా తంగేడు మొక్కలను నాటడంతో ప్రస్తుతం ఆ మొక్కలు వృక్షాలుగా ఎదిగి పూలతో తళుక్కుమంటున్నాయి. నిన్నమొన్నటి వరకు తంగేడు పూల కోసం ఇబ్బందులు పడిన మహిళలు ఇంటి ముందే ఉన్న తంగేడు పూలను కోసి బతుకమ్మలను పేర్చుతున్నారు. తంగేడు చెట్టు ఇంటి ముందు ఉంటే ఎంతో శుభప్రదమని, ఆరోగ్యానికి తంగేడు చెట్టు ఎంతో మంచి చేస్తుందని భావించి ప్రజలు గ్రామాల్లో విరివిగా తంగేడు మొక్కలను నాటారు.
తంగేడు పూల కష్టాలు తప్పినయి..
మా చిన్నప్పుడైతే తంగేడు పువ్వు ఎక్కడపడితే అక్కడ దొరికేది. ఇప్పుడా పరిస్థితి లేదు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే తంగేడుపూల కోసం చాలా కష్టపడేవాళ్లం. ప్రభుత్వమే తంగేడు మొక్కలను ఇండ్ల ముందు నాటుకొమ్మని ఇంటింటికీ తంగేడు మొక్కలను అందజేసింది. ఇప్పుడు ప్రతి ఇంటిముందు తంగేడు చెట్టు ఉండడంతో పూలను కావల్సినన్ని తెంపుకొని బతుకమ్మను పేర్చుతున్నాం.