
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 6 : హరితహారం మొక్కలను సంరక్షించాలని ప్లాంటేషన్ జిల్లా మేనేజర్ శశిరేఖ అన్నారు. ఈజీఎస్ ఏపీవో సంతోశ్రెడ్డితో కలిసి మండలంలోని గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించి నర్సరీ, హరితహారం మొక్కలను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీల్లోని మొక్కలు, రోడ్లు, వీధులకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. ఆయా గ్రామ నర్సరీల్లోని మొక్కలను రానున్న వానకాలం నాటికి సిద్ధంగా ఉంచాలన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, మహేశ్వరీ ఉన్నారు.
నర్సరీ మొక్కలకు నీళ్లు సరఫరా చేయాలి
నర్సరీల్లో ప్రతిరోజు మొక్కలకు నీళ్లు సరఫరా చేయాలని ఎంపీడీవో ఉమాదేవి పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం, నర్సరీని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నర్సరీల్లో గ్రామానికి సరిపడా మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. మొక్కలను రక్షించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆమె వెంట సర్పంచ్ కాశబోయిన భాస్కర్ తదితరులు ఉన్నారు.