
ఉధృతంగా పారుతున్న మంజీర జల దిగ్బంధంలోనే వనదుర్గమ్మ ఆలయం
పుల్కల్ రూరల్, అక్టోబర్ 1: సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతంగా కొనసాగుతున్నది. నాలుగు రోజులుగా సింగూరు ప్రాజెక్టుకు వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారి కళకళలాడుతున్నది. కర్ణాటక రాష్ట్రం దనేగావ్ ప్రాజెక్టు నుంచి వరద రూపంలో శుక్రవారం 95,516 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అప్రమత్తమైన అధికారులు, ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. క్రస్ట్‌గేట్ల ద్వారా 82,910 క్యూసెక్కులు, జెన్ కో ద్వారా 2,024 క్యూసెక్కులు, కెనాల్స్ 140 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్ 80 క్యూసెక్కులు, ఎంబీ 70 క్యూసెక్కులు, ఈవీపీలాస్ 300 క్యూసెక్కులు, మొత్తంగా 85,447 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు మాట్లాడుతూ వరద ఉధృతి కొనసాగుతున్న దృష్ట్యా నది పరీవాహక ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. కాగా, సింగూరు జలకళను సంతరించుకోవడంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
జలదిగ్భంధంలోనే వనదుర్గామాత..
పాపన్నపేట, అక్టోబర్ 1: ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం పదో రోజు కూడా జలదిగ్భంధంలోనే ఉన్నది. దీంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తుండగా, భక్తులు అమ్మవారిని అక్కడే దర్శనం చేసుకుంటున్నారు. గురువారం ఉదయం సింగూరు ప్రాజెక్టు నుంచి 75వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేయగా, శుక్రవారం అవి వనదుర్గాప్రాజెక్టు చేరుకొని 72వేల క్యూసెక్కుల నీరు వనదుర్గా ఆలయం ముందు నుంచి నిజాంసాగర్ వైపు పరుగులు పెట్టింది. నీటి ప్రవాహం వైపు భక్తులు వెళ్లకుండా ఏడుపాయల ఆలయ ఈవో సార శ్రీనివాస్, పోలీసు సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు.
‘వనదుర్గ’కు పోటెత్తిన వరద..
కొల్చారం/ హత్నూర, అక్టోబర్ 1: కురుస్తున్న వర్షాలకు తోడు సింగూరు నుంచి నీటిని వదలడంతో మంజీరా నది శుక్రవారం మహోగ్రరూపం దాల్చింది. వనదుర్గా ప్రాజెక్టుపై నుంచి ఐదు ఫీట్ల మేర నీరు ప్రవహిస్తున్నది. దీంతో పోతంశెట్‌పల్లి చౌరస్తా గుండా ఏడుపాయల వెళ్లే బ్రిడ్జి మట్టం నీరు ప్రవహిస్తుండడంతో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న సంగాయిపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, ఏటిగడ్డమాందాపూర్ గ్రామాల ప్రజలను వరదలపై అప్రమత్తం చేశారు. హత్నూర మండల పరిధిలోని కోన్యాల-చౌటకూర్ గ్రామాల మధ్య నిర్మించిన కల్వర్టుపై నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రాకపోకలు నిలిపివేశారు.