
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థుల్లో అభ్యసనాభివృద్ధి, సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. నాణ్యమైన, గుణాత్మక విద్యనందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ప్రతి విద్యార్థికి రాయడం, చదవడంతో పాటు గణితంలో చదుర్విదల ప్రక్రియలో నైపుణ్యం సాధించేలా ‘త్రీఆర్స్’ అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. కరోనా కారణంగా 18 నెలలుగా విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు బేసిక్ తప్పనిసరిగా వచ్చే విధంగా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యంగా విద్యార్థులకు చదవడం, రాయడం, గణితం(కూడిక, తీసివేత, గుణకారం, భాగహా రం) రాని విద్యార్థులు ఏ దశలో ఉన్నారనే విషయాన్ని మొదటగా గుర్తించి తదనంతరం వారికి సంబంధిత అంశాలను నేర్పించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్త్తున్నది. ఇందుకోసం జిల్లా వి ద్యాశాఖ అధికారులు ఈ నెల చివరిలోగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, రిసోర్స్పర్సన్లకు జూమ్ యాప్ ద్వారా ప్రత్యేక శిక్షణ తగరతులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రణాళికను రూపొందించి తెలుగు, హిందీ, ఆంగ్లం, భౌతిక, రసాయనిక, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఒక్కో గ్రూప్‌నకు ఒక ఉపాధ్యాయుడు బోధించేలా చర్యలు తీసుకుంటున్నారు. వారం లేదా 15 రోజులకొక సారి సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు గుర్తించనున్నారు. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా త్వరలో అమలులోకి రానున్నది. మెదక్ జిల్లాలో 923 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రాథమిక పాఠశాలలు 642, ప్రాథమికోన్నత పాఠశాలలు 136, ఉన్నత పాఠశాలలు145 ఉన్నాయి. వీటిల్లో మొత్తం 97,144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరిలోనూ అభ్యసనాభివృద్ధి సాధించే విధంగా ఉపాధ్యాయులు త్రీఆర్స్ అమలు చేయనున్నారు.
త్రీఆర్స్ అంటే..
త్రీఆర్స్ అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం(తెలుగు, ఆంగ్లంలో చదవడం, రాయడం, రీడింగ్, రైటింగ్ అర్థమెటిక్లపై అవగాహన) అని అర్థం. వీటిని ప్రతి విద్యార్థి సాధించాల్సిన కనీస సామర్థ్యాలుగా గుర్తించాలని ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం ప్రతి పాఠశాలలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నది. 3 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో చదవడం, రాయడం, అంక గణితం సమస్యలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం వంటి చదుర్విత ప్రక్రియలు నేర్పడానికి 45 రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో 1, 2, 10వ తరగతి విద్యార్థులను మినహాయించారు. ప్రతి పాఠశాలలోనూ ముందుగా తరగతుల వారీగా తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. తెలుగులో సరళపదాలు, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తక్షర పదాలు, వ్యాక్యాలు రాయడం వంటి కృత్యాలతో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల్లో 80 శాతం మార్కులు సాధించినట్లయితే వారిని ఒక గ్రూప్‌గా, రాని వారిని మరో గ్రూప్‌గా విభజించాలి. చదవడం, రాయడం రాని విద్యార్థులకు మొదటగా సరళ పదాలు నేర్పించాలి, అనంతరం గుణింతాలు నేర్పాలి. తదనంతరం వత్తి పదాలు, ఆ తదనంతరం వ్యాక్యాలు, పేరాలు చదవడం, రాయడం నేర్పించాలి. త్రీఆర్స్ కోసం ప్రతిరోజు చివరి రెండు పీరియడ్లు కేటాయించనున్నారు. నవంబర్ వరకు ప్రతి విద్యార్థికి త్రీఆర్స్ వచ్చేలా జిల్లా విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించింది.
త్రీఆర్స్పై త్వరలోశిక్షణ..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రీఆర్ అమలుకు ఈ నెలలోనే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు, రిసోర్స్పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నాం. తెలుగు, గణితం, ఆంగ్లంలో చదవడం, రాయడం లెక్కలు చేయడంలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశాం. వచ్చే నెల మొదటి వారంలో త్రీఆర్స్ ప్రారంభిస్తాం. ప్రతిరోజు చివరి రెండు పీరియడ్లు కేటాయించనున్నాం.
ప్రతి విద్యార్థికి త్రీఆర్స్ రావడమే లక్ష్యం..
ప్రతి విద్యార్థికి త్రీఆర్స్ రావడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. ఈ నెల మొదటి వారం నుంచి త్రీఆర్స్ నేర్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ప్రతి విద్యార్థికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖ త్రీఆర్స్ కార్యక్రమాన్ని చేపట్టింది.