e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు మెకానిక్‌ అరుణ

మెకానిక్‌ అరుణ

మెకానిక్‌ అరుణ

భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్న మహిళ
టైర్లకు పంక్చర్లు వేస్తూ జీవనోపాధి
20ఏండ్లుగా అదే వృత్తిలో..
ఆదర్శంగా నిలుస్తున్న వైనం

వనపర్తి, ఏప్రిల్‌ 3 :భర్త ఒక్కడే పని చేస్తే పూట గడవని పరిస్థితి..చేతికింద పని వాళ్లను పెట్టుకుంటే జీతం ఇవ్వలేని దుస్థితి..అప్పుడే తాను ఒక నిర్ణయానికి వచ్చింది. బయట వేరే ఎక్కడో పని చేయడంకంటే భర్త చేస్తున్న టైర్లకు పంక్చర్లు వేసే పనే తానూ నేర్చుకున్నది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా భర్తతో సమానంగా భారీ వాహనాల టైర్లను సైతం అలవోకగా పంక్చర్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది అరుణ. మొక్కవోని ధైర్యంతో 20ఏండ్లుగా అదే వృత్తిలో రాణిస్తున్న అరుణపై ప్రత్యేక కథనం.

కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు నిత్యం కష్టపడుతున్న భర్తకు భార్య తోడుగా నిలిచింది.. తన భర్త ఎంచుకున్న టైర్ల పంక్చర్‌ వృ త్తిని నేర్చుకుని చేదోడువాదోడుగా ఉంటూ తన భర్త కష్టాల్లో పాలుపంచుకుంటున్నది.. పలువురి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నది.. ఉదయం, సాయంత్రం ఇంటి పనులు చేసుకుంటూనే.. 20 ఏండ్లుగా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తున్న మెకానిక్‌ అరుణపై ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం ప్రత్యేక కథనం..


ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన ఎరుకలి మద్దిలేటి, అరుణ భార్యాభర్తలు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరిరువురు పొట్ట చేతపట్టుకుని కొత్తకోట పట్టణానికి 25 ఏండ్ల కిందట వలస వచ్చారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ పక్కన వాహనాల టైర్లు పంక్చర్లు చేసేందుకు చిన్న షెట్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఓ చిన్న ఇంటిని కిరాయికి తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి సరైన ఉపాధి లేదు. ఇంటి పెద్దకు పంక్చర్లు చేయడం, టైర్లు మార్చడం మినహా వేరే పని తెలియదు. తోడుగా పనిచేసేందుకు మనుషులు లేకపోవడంతో ఇంటి ఇల్లాలే చేదోడువాదోడుగా నిలిచింది.

మగవారికి సైతం చాలా కష్టమైన వాహనాల టైర్ల పంక్చర్లు చేసే పనిని అరుణ అనతి కాలంలోనే నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. 30 నుంచి 40 కేజీల బరువు ఉండే టైర్లను అలవోకగా మారుస్తున్నది. 20 ఏండ్లుగా భర్తకు దీటుగా బైక్‌లు, లారీలు, కంటైనర్లు, జేసీబీలతో సహా హెవీ వెహికిల్స్‌ టైర్లు మార్చడం, పంక్చర్లు చేయడం వంటివి అలవోకగా చేస్తున్నది. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా, పెద్ద అమ్మాయికి వివాహం చేశారు. మిగిలిన ఇద్దరు పిల్లలను పాఠశాలలకు పంపించిన తర్వాత అరుణ నేరుగా దుకాణానికి వెళ్లి సాయంత్రం వరకు పంక్చర్లు చేస్తున్నారు. షాపులో పని నేర్చుకున్న సమయంలో ఎంతో మంది ఆడవాళ్ల కు అవసరమా.. అని అన్నవారే నేడు మా దుకాణానికి వస్తున్నారని అరుణ చెబుతున్నారు.

నా భార్య సహకారంతోనే..
నా భార్య అరుణ అండగా ఉంటున్నది. కష్టాల్లో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదట్లో పని చేయడానికి ఆమె చాలా కష్టాలు పడింది. రెండు నెలల్లోనే అన్ని పనులు నేర్చుకుని తోడుగా నిలిచింది. నా భార్య సహకారంతోనే పిల్లలు, నేను రెండు పూటలా భోజనం చేస్తున్నాం.

  • మద్దిలేటి, కొత్తకోట

  • ఆర్థిక ఇబ్బందులతోనే..
    నా భర్త చేసే కష్టానికి వచ్చే ఆదాయం సరిపోకపోయేది. ఆర్థిక ఇబ్బందులతో నే ఈ పని నేర్చుకున్నాను. భర్తకు తోడుగా నిలిచాను. ప్రసుత్తం బాగానే ఉన్నాం. సొంత ఇల్లు లేదు. ప్రభుత్వం దయచూపి రెండు పడకల గదులను మంజూరు చేయించాలి. మా విన్నపాన్ని నెరవేరుస్తారని కోరుకుంటున్నాను.
  • – అరుణ, కొత్తకోట

ఇవికూడా చదవండి..

గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు

మల్లన్న చెంత…గోదారి సాగరం

థియరీ తర్వాత ప్రాక్టికల్స్‌

7నుంచి ఐసెట్‌ దరఖాస్తులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెకానిక్‌ అరుణ

ట్రెండింగ్‌

Advertisement