e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News రైతన్నపై ఎరువు పిడుగు

రైతన్నపై ఎరువు పిడుగు

  • భారీగా పెరిగిన ఎరువుల ధరలు
  • చోద్యం చూస్తున్న మోదీ సర్కార్‌
  • రకాన్ని బట్టి 50నుంచి 70శాతం పెరుగుదల
  • రెట్టింపునకు చేరువలో పొటాష్‌ ధర
  • ఉమ్మడి జిల్లా రైతులపై రూ.50కోట్లకు
  • పైగా భారంపెరిగిన ధరలపై పోరుబాటలో టీఆర్‌ఎస్‌
  • నోరు విప్పని బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు తాజా ఉదాహరణే ఎరువుల ధరల పెంపు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువగా వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగడంతో రైతులకు మోయలేని భారంగా మారింది. వాస్తవంగా గత యాసంగిలోనే ఎరువుల ధరలు భారీగా పెరుగగా ఇప్పుడూ అంతేస్థాయిలో పెరిగాయి. ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో దానిపై 50 నుంచి 70శాతం వరకు ధరలు పెరిగాయి. ఇక పొటాష్‌ ధర ఏడాదిలోనే రెట్టింపునకు చేరువైంది.
దీంతో పెరిగిన ఎరువుల ధరలు రైతులకు ఆర్థికంగా భారం కానున్నాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్‌లోనే రైతాంగంపై కనీసం రూ.40 నుంచి రూ.50కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా.ఈ ధరలపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర సర్కార్‌ తరుఫున కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక క్షేత్రస్థాయిలోనూ రైతులతో కలిసి పోరాటానికి టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. మరోవైపు ప్రతి చిన్న విషయానికీ ఒంటికాలిపై లేచే బీజేపీ నేతలకు ఎరువుల ధరలు మాత్రం పట్టడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

నల్లగొండ ప్రతినిధి, జనవరి14 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అధోగతి పాలైన ఉమ్మడి నల్లగొండ జిల్లా.. స్వరాష్ట్రంలో సాగునీరు, ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో మంచి పురోగతి సాధించింది. 2014లో 13లక్షల ఎకరాలే సాగు కాగా ఏడేండ్లలో అదనంగా 8 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగి 21 లక్షల ఎకరాలకు పెరిగింది. వరితోపాటు పత్తి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సాగునీటిని అందిస్తూ…. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతుండడంతో వ్యవసాయమంటే మక్కువతో ఎక్కువ మంది తిరిగి సాగువైపు దృష్టి మళ్లారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతోపాటు పంటల కొనుగోలు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడంతో రైతులు సంతోషంగా సాగుబాటలో పయనిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు రైతాంగాన్ని ఇబ్బందిలోకి నెడుతున్నాయి. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. దాంతో కొనుబోమంటే ఎలా అని ఉమ్మడి జిల్లా రైతాంగం ఓ మారు కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేసింది. జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడ్డుకొని సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండానే తాజాగా ఎరువుల ధరలు పెంచి రైతన్నపై మరోమారు కేంద్ర ప్రభుత్వం తన కక్షపూరిత వైఖరిని బయటపెట్టుకున్నది. ఎరువుల ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన మోదీ సర్కార్‌ తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నది. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

- Advertisement -

50 నుంచి 70శాతం వరకు పెంపు..

జిల్లాలో రైతులు ఎక్కువగా వినియోగించే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో రకం ఎరువు ధర ఏడాదిలో కనీసం 50 -70 శాతం పెరిగింది. ఒక్కో రైతుపై సగటున ఏడాదికి రెండు నుంచి మూడు వేల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. ఒక్క డీఏపీ తప్ప మిగతా అన్ని కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగాయి. 14-35-14 రకం ఎరువు ధర గత యాసంగిలో 1275 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది రూ.1900లకు చేరింది. 28-28-0 ధర రూ.1275 నుంచి రూ.1900లకు పెరిగింది. 24-24-0-8 రకం ధర 1200 నుంచి రూ.1800లకు పెరిగింది. 20-20-0-13 రకం కాంపెక్స్‌ ఎరువు ధర రూ.950 ఉంచి1325 రూపాయలకు పెరిగింది. ఇక ఇప్పుడు పొటాష్‌ బస్తా ధర గత యాసంగిలో రూ.950 ఉండగా ప్రస్తుతం ఏకంగా 1700రూపాయలకు చేరింది. పోటాశ్‌ ధర ఏడాదిలో 90 శాతం పెరుగడం గమనార్హం. గత యాసంగి తర్వాత ఈ ఏడాది వానకాలంలోనూ ఎరువుల ధరలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి పెంచడం అంటే ఏడాదిలో రెండుసార్లు పెరిగినట్లు.

ఉమ్మడి జిల్లాలో రైతులపై రూ.50కోట్ల అదనపు భారం..

ఈ యాసంగిలోనే ఉమ్మడి జిల్లా రైతాంగంపై ఎరువుల ధర భారం అక్షరాల యాభై కోట్లు ఉండనుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ తీరుతో ఈ సారి రైతాంగం అంతంతమాత్రమే వరిని సాగు చేస్తున్నది. గత ఏడాది మాదిరిగా 11 లక్షల ఎకరాలకుపైగా వరి పంట సాగైతే కనీసం రూ.100 కోట్లకు పైగానే భారం పడేది. ఈ సారి యాసంగిలో ప్రభుత్వం చేసిన ప్రకటన నేపథ్యంలో రైతులు వరిసాగును తగ్గించి ఇతర పంటలపై దృష్టి సారించారు. ప్రాజెక్టులతోపాటు బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో వరి తప్ప ఇతర పంటలు పండని భూముల్లో వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇక వీటితోపాటు మిల్లర్లు, వ్యాపారులు, విత్తన సంస్థలతో ఒప్పందం మేరకు ఇతర ప్రాంతాల్లోని రైతులు కొందరు వరిసాగుకు సిద్ధ్దపడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 5 లక్షల నుంచి 6లక్షల ఎకరాలలో వరిసాగు చేయవచ్చని అంచనా. ఇవి కాకుండా ఇతర పంటలు కూడా పెద్ద ఎత్తున సాగువుతున్నాయి. వీటికి కూడా కాంప్లెక్స్‌ ఎరువుల అవసరం ఉండనుంది. ఎకరం వరి సాగుకు కనీసం రెండు కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాలు అవసరం. వానకాలం ధరతో పోలిస్తే ఒక్కో బస్తాపై రూ.350, గత యాసంగి ధరతో పోలిస్తే రూ.700వరకు పెరుగుదల కనిపిస్తున్నది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ జేబును కొల్లగొడుతుందని రైతులు మండిపడుతున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోరుబాటలో టీఆర్‌ఎస్‌…

కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలపై ఇప్పటికే పోరాడుతున్న టీఆర్‌ఎస్‌ ఎరువుల ధరల తగ్గింపు కోసం కూడా ఆందోళనకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖరాస్తూ పలు ప్రశ్నలు సంధించారు. రైతులతో పోరాటానికి సిద్ధ్దమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే మోదీ సర్కార్‌ మాత్రం రైతుల జేబుకు చిల్లుపెట్టేలా వ్యవహరిస్తున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా రైతు అనుకూల నిర్ణయాలు కేంద్రం తీసుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం ప్రభుత్వ పథకాలకు అవరోధం కల్పించేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై మొండిగా వ్యవహరిస్తున్న కేంద్రం, తాజాగా ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డివిరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం భాగస్వాములు కావాలని, రైతాంగాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుండి నడుపాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పెరిగిన ఎరువుల ధరపై బీజేపీ నేతలు నోరు మెదపకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ధరలు తగ్గించేలా కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement