నందికొండ, ఏప్రిల్ 7 : వర్షాకాలం లోపు ప్రాజెక్టుకు చేపట్టాల్సిన మెయింటెనెన్స్ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ ఓ అండ్ ఎం నాగేంద్రరావు అన్నారు. గురువారం ఆయన సాగర్ డ్యామ్‌ను సందర్శించి క్రస్ట్ గేట్లు, గ్యాలరీ, డ్యామ్‌పై ఉన్న క్రేన్ ట్రాక్, క్రస్టుగేట్లు, డ్యామ్‌పైన చేపడుతున్న మెయింటెనెన్స్ పనులు పరిశీలించారు. డ్యాం లిఫ్టు రిపేరులో ఉండడంతో, డ్యాం దిగువన ఉన్న 420గ్యాలరీకి రోడ్డు మార్గంలో వెళ్లి గ్యాలరీలో డ్యామ్‌కు సంబంధించిన నీటి లీకేజీలను పరిశీలించారు. గ్యాలరీల నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్డు మార్గంలో ప్రధాన డ్యామ్‌పైకి చేరుకుని డ్యామ్‌పై తుప్పు పట్టిన క్రేన్ ట్రాక్‌ను పరిశీలించి మరమ్మతులకు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. క్రస్ట్‌గేట్ల దిగువన ఏర్పాటు చేసిన వాక్‌వే బ్రిడ్జి పైకి నడుచుకుంటూ వెళ్లి 22వ క్రస్ట్‌గేట్‌ను ఆపరేట్ చేసి క్రస్టుగేట్ల పనితీరు, గేట్ల రోప్స్, గిడ్డర్లను పరిశీలించారు. క్రస్టుగేట్లతో లీకేజీ వాటర్ పోకుండా ఏర్పాటు చేసిన రబ్బర్ సీళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం లోపు చేపట్టాల్సిన డ్యాం నిర్వాహణ పనుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్నింటికి ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా చీఫ్ ఇంజినీర్ శ్రీకాంత్‌రావు, ఈఈ మల్లికార్జున్, డీఈ పరమేశ్, ఏఈ కృష్ణయ్య ఉన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి మరమ్మతులకు త్వరలో చర్యలు చేపడుతామని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు అన్నారు. ఏఎమ్మార్పీ ప్రా జెక్టులో భాగమైన పంపుహౌస్, సిస్టర్న్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ ఏఎమ్మార్పీ నుంచి పూర్తిస్థాయిలో జంట నగరాలకు తాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.