మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు అత్యంత వెనుకబడిన, పేద, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ నేడు వివిధ అంశాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటం గర్వంగా ఉందని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భూగర్భ జలాల పెంపు, మహ బ్రాండ్ ఉత్పత్తులకు జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు వచ్చిన సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఏడేండ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 14నుంచి 20లక్షల మంది వలస వెళ్లే వారని, దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత, ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండేవన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ అంశాలలో రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు. జిల్లాలో రూ.170 కోట్లతో 27 చెక్ డ్యాములు నిర్మించడం ద్వారా సుమారు 6.22 మీటర్ల మేర భూగర్భజలాలను పెంచామన్నారు. అందరి శ్రమ వల్లే స్కోచ్ గోల్డ్ అవార్డ్ వచ్చిందన్నారు. మహా బ్రాండ్ పేరుతో మహిళలు వివిధ ఉత్పత్తులను తయారు చేసి ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ వంటి సంస్థలతో అనుసంధానం చేసుకొని అమ్మకాలు కొనసాగిస్తున్నందున స్కోచ్ సిల్వర్ అవార్డు రావడం కూడా గర్వకారణమన్నారు. పట్టణంలో శిల్పారామం, కళాభారతి పనులు కూడా వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు.
హన్వాడ, గండీడ్ మండలాలకు ఒక్కొక్కటి రూ. 9 కోట్లతో చెక్ డ్యాములు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. స్కోచ్ గోల్డ్ అవార్డును చీఫ్ ఇంజినీర్ రమేశ్, వారి సిబ్బందికి అందజేయగా, మహ బ్రాండ్‌కు వచ్చిన స్కోచ్ సిల్వర్ అవార్డును డీఆర్డీవో యాదయ్య వారి టీంకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, ఏపీడీ శారద, నీటిపారుదల శాఖ ఎస్ఈలు, డీఈలు, ఏఈలు, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.