యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి రైతులకు అండగా నిలిచిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులు, అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం పల్లెలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలతోపాటు వ్యవసాయ క్షేత్రాల్లోనూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వనపర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి భారీ చిత్రపటాలకు క్రేన్ సాయంతో క్షీరాభిషేకం చేశారు. వనపర్తి మున్సిపాలిటీలోని శ్రీనివాసపురం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులు, చిట్యాల శివారులోని పొలాల్లో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటంతో ప్రదర్శన నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో రైతుల తరఫున ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు బైక్ ర్యాలీ నిర్వహించారు.