నాగర్కర్నూల్/మహబూబ్నగర్, ఏప్రిల్ 22 : నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వర్ష భీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా పట్టణాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రాత్రి పొద్దుపొయే వరకు కరెంటు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పట్టణంలోని వీధులు, రహదారులు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారిలో ప్రజలు నడిచేందుకు కూడా వీలులేకుండా నీళ్లు పారాయి.
ఈదురుగాలులతో ఆయా గ్రామాల్లో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే జడ్చర్ల, కొల్లాపూర్లో కూడా భారీ వర్షం కురిసింది. కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యాతండాలో వడగండ్లు కురిశాయి. సుమారు 10 ఎకరాల్లో ధాన్యం నేలమట్టమైంది. గేమ్యాతండాలో సాలమ్మ ఇంటి సిమెంట్ రేకులు లేచిపోయాయి. వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. తిమ్మాజిపేట మండలం ఎదిరేపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది.