
మలీజా, మటికలతో ఫాతెహాలు
అలావ్ చుట్టూ చిందులు తొక్కిన యువత
పీర్లచావిడీ వద్ద పండుగ వాతావరణ
ఉప్పునుంతల, ఆగస్టు 20: మండలంలోని వివిధ గ్రామాల్లో పీర్ల పండుగ వారంరోజులపాటు కొనసాగింది. హిందూ ముస్లిం తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకొన్నారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మలీజా, మటికలతో ఫాతెహాలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని పీర్లచావిడీ వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. పెద్దసంఖ్యలో భక్తులు అలావ్ చుట్టుగా చిందులు తొక్కుతూ అసోయ్దూలా అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రందాకా పీర్లను ఎత్తుకొని ఆటలాడారు. పీర్ల పండుగ సందర్భంగా వివిధ రకాల వేషధారణలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాత్రి పీర్లను ఊరిచివరలో ఉన్న బావిలో నిమజ్జనం చేశారు. దీంతో వారం రోజులుగా కొనసాగిన పీర్ల పండుగ శుక్రవారంతో ముగిసింది.
పదర మండలంలో..
పదర, ఆగస్టు 20: మండలంలో పీర్ల పండుగను ప్రజలు మతాలకతీతంగా జరుపుకొన్నారు. వారం రోజలుగా గ్రామాల్లోని పీర్లచావిడీల్లో కొలువుదీరిన పీర్లకు పూజలు చేస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రాత్రివేళ కులమతాలకు అతీతంగా అలయ్ ఆడుతూ సంబురాలు జరుపుకొన్నారు. పీర్లకు మొక్కులు తీర్చకోవడానికి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన భక్తులు తిరిగి స్వగ్రామానికి చేరుకోవడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. శుక్రవారంతో ఉత్సవాలు ముగిశాయి. గ్రామంలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. చిట్లంకుంట, ఉడిమళ్లగ్రామాల్లో మొహర్ర జరుపుకొన్నారు.
లింగాల మండలంలో..
లింగాల, ఆగస్టు 20: మండలంలోని ఆయా గ్రామాల్లో మొహర్రం సంబురాలను భక్తిశ్రద్ధలతో మతాలకతీతంగా జరుపుకొన్నారు. పీర్లపండగ వచ్చిందంటే పదిరోజులపాటు హిందు, ముస్లిం తేడాలేకుండా కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సాంప్రదాయంగా వస్తున్న మొహర్రం పండగ వేడుకలను భక్తి శ్రద్ధలతో మొక్కు నిర్వహించుకున్నారు. మొక్కులను తీర్చుకోవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొన్నది. పీర్లపండగ సందర్భంగా యువకులు వివిధ వేషాలు ధరించి గ్రామాల్లో తీరుగుతూ అందరిని ఆనందపరుస్తారు.గ్రామాలలో పీర్ల వద్దకు తమ మొక్కులను చెల్లించుకున్నారు. మండలంలోని లింగాల, అప్పాయిపల్లి, అంబట్పల్లి, కొత్తకుంటపల్లి, జీలుగుపల్లి, సూరాపూర్, శాయిన్‌పేట, రాయవరం, ధారారం తదితర గ్రామాల్లో హిందు, ముస్లిం ఐక్యతతో మతసామరస్యానికి ప్రతీకగా పీర్లపండగను సంతోషంగా జరుపుకొంటున్నారు. మొహర్రం సందర్భంగా ముస్లింలు షర్బత్‌ను తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు.
కొల్లాపూర్ మండలంలో..
కొల్లాపూర్, ఆగస్టు 20: మొహర్రం వేడుకల్లో భాగంగా పదోరోజు శుక్రవారం సాయంత్రం పీర్ల నిమజ్జనంతో గ్రామాల్లో సందడిగా మారాయి. ఆనవాయితీగా ప్రతి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా పోటేళ్లు, మేకపోతులను బలిచ్చి మొక్కులను చెల్లించుకున్నారు. ఆడపడుచులను పుట్టింటికి తీసుకురావడంతో గ్రామాల్లో పిల్లాపాపలతో సందడిగా మారాయి. పీర్లు నిమర్జనం సందర్భంగా సాయంత్రం చావిడీల నుంచి టప్పెట్లమోతల మధ్య పీర్లను ఎత్తుకుని నిమజ్జనానికి ఉత్సాహ వాతావరణంలో దర్గాల వద్దకు చేరారు. కొల్లాపూర్ మండలంలో పీర్ల ఉత్సవాలు కుడికిళ్ల, చుక్కాయపల్లి గ్రామాలతోపాటు మొలచింతపల్లి, ముక్కిడిగుండం, నార్లాపూర్, ఎల్లూరు, చౌటబట్ల, చింతలపల్లి, రామాపూర్ గ్రామాల్లో మతాలకతీతంగా నిర్వహించారు. గురువారం రాత్రి పీర్ల చావిడీల వద్ద యువకులు ఉత్సాహంతో అలావుతొక్కడం, మహిళలు బతుకమ్మ ఆడారు. కొల్లాపూర్ పట్టణంలోని కోటవీధి, వరిదేలలోని చావిడీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జాఫర్, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీచారి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నిరంజన్, పట్టణ మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బండల వెంకటస్వామి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, సింగిల్‌విండో డైరెక్టర్ తాళ్ల పరశురాంగౌడ్ తదితరులు పీర్లను దర్శించుకున్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, ఆగస్టు 20: మండలంలోని ఆయా గ్రామాల్లో మోహర్రం నిర్వహించారు. మరికల్, చంద్రకల్, పెద్దకారుపాముల, పెద్దకొత్తపల్లి, సాతాపూర్, కల్వకోలు తదితర గ్రామాల్లో మోహర్రంను కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పీర్ల వద్ద ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, జెడ్పీటీసీ గౌరమ్మ ఆయా గ్రామాల సర్పంచులు మొక్కలు తీర్చుకున్నారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లో సందడి నెలకొన్నది.
ప్రజలకు బెల్లం పానకం పంపిణీ
కొల్లాపూర్, ఆగస్టు 20: మొహర్రం పర్వదినం సందర్భంగా పీర్ల పండుగ ముగింపు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో ముస్లింలు ప్రజలకు బెల్లం పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇస్లాం ధర్మ సంస్థాపన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇమామ్ హుస్సేన్, వారి అనుచరులు చేసిన మహోన్నత త్యాగాలకు ప్రతిక మొహర్రం పండుగని వివరించారు. ఇమామ్ హుస్సేన్ ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
బల్మూర్ మండలంలో..
బల్మూరు, ఆగస్టు 20: మొహ్రరంను మండలంలో భక్తులు, ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పీర్ల మసీద్‌లో భక్తులు, మలీజ, పానకంతో మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం 10వ రోజు కావడంతో మేకపోతులతోను బలిస్తు, కందూర్లు చేశారు. ఈ పండుగకు వలస వెళ్లినవారు తిరిగి గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో పండుగ వాతవారణం ఏర్పడింది. అనంతవరం, గోదల్, మహదేవపూర్, కొండనాగుల, బల్మూరు, తుమ్మెన్‌పేట, జినుకుంట తదితర గ్రామాల్లో మొహర్రం నిర్వహించారు.
నల్లమలలో మొహర్రం
అచ్చంపేట, ఆగస్టు 20: నల్లమలలో మొహర్రం వేడుకలు మతాలకతీతంగా నిర్వహించారు. శుక్రవారం గ్రామాలు, పల్లెలు, తండాలు, పట్టణాల్లో మొహరం సందర్భంగా పీర్ల చావిడీల వద్ద పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. పీర్లను వీధుల్లో ఊరేగించారు. పీర్లచావిడీల వద్ద కందూర్లు నిర్వహించారు. అలయ్ వద్ద ఆడిపాడారు. మొహర్రం సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ముస్లిం యువకులు షర్బత్ ప్రసాదం పంపిణీ చేశారు.