
కనువిందు చేసిన పీర్ల సవారీ
దట్టీలు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 20 : మొహర్రం వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మొహర్రం ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన పీర్ల సవారీ కనువిందు చేసింది. కులమతాలకు అతీతంగా భక్తులు పీర్లకు దట్టీలు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాకేంద్రంలోని పాతపాలమూరు, వీరన్నపేట, టీడీగుట్ట, రామయ్యబౌలి, ఎదిర, అప్పన్నపల్లి, దివిటిపల్లి తదితర ప్రాంతాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, ఆగస్టు 20 : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగను పట్టణవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఉపవాసదీక్ష చేపట్టడంతోపాటు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పోరాటయోధులు హసన్, హుస్సేన్‌లను స్మరించుకున్నారు. సాయంత్రం స్థానిక పాతబజార్ పీర్లమసీదు వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు పీర్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిట్టల మురళి, కౌన్సిలర్ రమేశ్ పీర్లను దర్శించుకొని పూజలు చేశారు. కాగా, పిల్లలు, పెద్దలు కోలాటాలు, ఆటపాటలు, డప్పు మోతల మధ్య పీర్ల ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 20 : మండలకేంద్రంతోపాటు పెద్దరేవల్లి, నేరళ్లపల్లి, ఉడిత్యాల, చిన్నరేవల్లి గ్రామాల్లో మొ హర్రం వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భం గా పీర్ల ఊరేగింపు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పీర్లకు దట్టీలు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పీర్లను నిమజ్జనం చేశారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఆగస్టు 20 : మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి, వాడ్యాల్, వేముల, కొత్తూర్, చిల్వేర్, దోనూర్, భైరంపల్లి, రాణిపేట, వల్లభురావుపల్లి, తదితర గ్రామాల్లో పీర్ల నిమజ్జనం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముజావర్ల పాదాలకు భక్తులు నీళ్లు పోసి హసేన్, హుస్సేన్ పీర్లకు దట్టీలు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఆగస్టు 20 : మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఆగస్టు 20 : మండలకేంద్రంతోపాటు చొక్కంపేట, దోండ్లపల్లి, తిర్మలాపూర్, చెన్నవెల్లి, కుచ్చర్కల్, ఖానాపూర్, రంగారెడ్డిగూడ తదితర గ్రామాల్లో కులమతాలకు అతీతంగా ప్రజలు మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పీర్లకు దట్టీలు, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పీర్లను నిమజ్జనం చేశారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 20 : అడ్డాకుల మండలకేంద్రంతోపాటు పొన్నకల్, కందూరు, రాచాల, శాఖాపూర్, మూసాపేట మండలకేంద్రంతోపాటు, సంకలమద్ది, మహ్మదుస్సేన్‌పల్లి, జానంపేట, చక్రాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీర్లచావిడీల వద్ద అలాయ్ చుట్టూ మహిళలు బొ డ్డెమ్మ ఆడారు. యువకులు, వృద్ధులు కోలాటం వేశారు. పీర్ల కు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, ఆగస్టు 20 : మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, మధుసూదన్‌గౌడ్, మాధవ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, ఆగస్టు 20 : మండలంలోని కూచూర్, కొ ల్లూరు, చౌడూర్, ఇప్పటూర్, కాకర్జాల, పోమాల, లింగంపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం ఉత్సవాలను కులమతాలకు అతీతంగా జరుపుకొన్నారు. వారంరోజుల కిందట పీర్ల మసీదుల్లో ప్రతిష్ఠించిన పీర్లను నిమజ్జనం చేశారు. కూ చూర్లో నిర్వహించిన పీర్ల ఉత్సవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచులు పిట్టల లక్ష్మమ్మ, సౌజన్యరఘు, గౌసియాఅబ్దుల్లా, అలివేలుపరశురాములు, కృష్ణ య్య, పాండురంగారెడ్డి, నాగిరెడ్డి, పిట్టల రవి, సంజీవరెడ్డి, భోజయ్యాచారి, నర్సింహగౌడ్ పాల్గొన్నారు.