
ఆధునిక సాగుతో అధిక దిగుబడి
సాంకేతికతవైపు అడుగులు వేయాలి
పంటపై అవగాహన ఉండాలి
పంట మార్పిడి విధానం పాటించాలి
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలి
సాగు చేసే పంటలపై అవగాహన ఉండాలి
పంట మార్పిడీ విధానం అవలంబించాలి
రైతులు చాలా వరకు సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారు. ఏటా
ఆశించిన మేర దిగుబడులు రాకున్నా.. నష్టం జరుగుతున్నా .. పాత పద్ధతులను మాత్రంవీడటం లేదు. ప్రతి ఏడాది వేసిన పంటలనే మళ్లీ మళ్లీ సాగు చేయడం పరిపాటిగామారింది. దీంతో దిగుబడులు రాక, మద్దతు ధర లభించక కర్షకులుతీవ్రంగానష్టపోతున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ఆధునిక పద్ధతులను అవలంబించాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే మంచి దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు.
పెబ్బేరు, ఆగస్టు19: ఆధునిక సాంకేతికత వైపు రైతన్నలు అడుగులు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. యాంత్రీకరణతోపాటు నూతన రకాల వంగడాలను ఉపయోగించి సాగులో మెళకువలు పాటించి లాభాలు పొందాలని చెబుతున్నారు. పంట వేసే ముందు రైతు వ్యాపారిలా ఆలోచించాలి. సాగు చేయబోయే పటంకు ఎంత పెట్టుబడి అవుతుంది..ఆదాయం ఎంత వస్తుంది అనే విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సరైనా ప్రణాళిక లేకుండా తోటి రైతులు వేసిన పంటలే వేద్దామనుకుంటే చిక్కులు తప్పవు. మార్కెట్ సరళిని కూడా రైతులు అంచనా వేయగలగాలి. చిన్న, సన్నకారు రైతులు వీలైనంత వరకూ పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండే వాణిజ్య పంటలు, ఏడాది పొడవునా సాగులో ఉండే పంటలను ఎంచుకోకూడదు. పంట వేసే ముందు గత ఏడాది తమ ప్రాంతంలో వచ్చిన పంట దిగుబడి, రాష్ట్ర సర్కార్ కల్పించిన మద్దతు ధర, చీడపీడల ఉధృతి వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించాలని సూచిస్తున్నారు.
సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత
రైతులు సిఫార్సు చేసిన మోతాదుకు మించి రసాయన ఎరువులను వాడటం వల్ల భూములు నిస్సారమవుతున్నాయి. చీడపీడల ఉధృతి పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయి. రైతులు అవసరమైన మేరకు మాత్రమే రసాయన ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వర్మీకంపోస్ట్, పశువులు, జీవాల ఎరువులను విరివిగా వాడాలి. వీటితో పాటు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు చల్లి అవి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నితే చేనుకు కావాల్సినంత చేవ లభిస్తుంది. వేప పిండి వంటివి కూడా మొక్కలకు అవసరమైన శక్తిని అందిస్తాయి.
స్వల్పకాలిక పంటలే మేలు
నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకుని రెండు, మూడు నెలల్లో కోతకు వచ్చే స్వల్పకాలిక పంటలను సాగు చేయడం రైతులకు లాభదాయకం. దీనివల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. అవసరమైతే రెండో, మూడో పంట కూడా వేసుకోవచ్చు. ఏ కారణం చేతనైనా ఒక పంటను నష్టపోయినప్పటికీ మరో పంట ఆదుకునే అవకాశం ఉంటుంది. ఒకే భూమిలో ఒకే పంటను వరుసగా పండించడం మంచిది కాదు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. దీనివల్ల చీడపీడల బాధ ఉండదు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ పోకడలకు అనుగుణంగా పంటలు వేసుకోవాలి.
యాంత్రీకరణపై దృష్టి పెట్టాలి..
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పుడు ఎంత డబ్బు ఇస్తామన్నా కూలీలు దొరకని పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల సకాలంలో పనులు పూర్తి కావు. సమస్యను పరిష్కరించేందుకు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపక తప్పదు. పొలం దున్నడం నుంచి పంట కోత వచ్చేంత వరకు అన్ని పనులను యంత్రాల సాయంతో పూర్తి చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. రైతులు ఒకవేళ తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆధునిక వ్యవసాయ పరికరాలను వ్యక్తిగతంగా కొనలేని పరిస్థితి ఉంటే సంఘాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే బిందు సేద్యం, స్ప్రింకర్ల ద్వారా సాగు నీటిని అందిస్తే నీటిని ఆదా చేయవచ్చు. ఈ పరికరాల కొనుగోళ్లపై రాష్ట్ర సర్కార్ పెద్ద ఎత్తున సబ్సిడీలు కూడా అందజేస్తుంది.