
అచ్చంపేట, ఫిబ్రవరి 1 : దేశవ్యాప్తంగా నాలుగేండ్ల్లకోసారి జంతువుల గణనను అటవీశాఖ చేపడుతుంది. ఈ క్రమంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో జాతీయ పు లుల సంరక్షణ యాజమాన్యం ఆదేశాల మేరకు అటవీశాఖ పర్యవేక్షణలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గణన ప్రారంభమైంది. ఈనెల 7 వరకు జంతువుల లెక్కింపు కొనసాగునున్నది. ఇందుకోసం 180 మంది అటవీశాఖ అధికారులు, వాచర్లతో పాటు 60 మంది వలంటీర్లకు మన్ననూర్ అటవీశాఖ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. 1,68,531 హెక్టార్లలో అడవి విస్తరించి ఉన్న అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట రేంజ్ పరిధిలో 24 సెక్షన్లు, 142 బీట్లుగా విభజించి ఏడు రోజులపాటు 60 బృందాలచే సర్వే కొనసాగించనున్నట్లు ఎఫ్‌డీవో రోహిత్‌రెడ్డి తెలిపారు. ఒక్కో బృందంలో ఇద్దరు చొప్పున ఉంటారని, నిత్యం ఉదయం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు 2 కిలోమీటర్ల చొప్పున కాలినడకన వెళ్లి 30 మీటర్ల దూరం చొప్పున మార్కింగ్ చేసి అక్కడ ఏ రకం చెట్లు, ఎలాంటి జంతువులు ఉన్నాయో.. వాటి కదలికలు, గుర్తులు సేకరిస్తారని చెప్పారు. మాంసాహార జంతువులను మూడ్రోజుల పాటు, మిగిలిన నాలుగు రోజులు పూర్తి నివేదిక తయారు చేసి అందించనున్నట్లు చెప్పారు. వన్యప్రాణుల మూత్ర విసర్జన, పాదాలు గుర్తించడంతోపాటు కనిపించిన జంతువుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేస్తున్నారు. సాంబర్, నీల్గాయి, చుక్కలదుప్పి, సింగార, అడవిపంది, కుందేళ్లు, కృష్ణజింక, కొండగొర్రె తదితర జంతువులను లెక్కిస్తుండగా.. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.