
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 1: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లు దాటినా నేటికీ దళితులు పేదరికంలో ఉన్నారని, వారి అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మూసాపేట మండలం సంకలమద్ది, అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలోని దళితవాడలో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్డాడుతూ దళితబంధు పథకం లక్ష్యాలను దళితులకు వివరించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ఉమ్మది రాష్ట్రంలో నాటి పరిస్థితి ఎట్లుండే, నేటి పరిస్థితి ఎలా ఉందనే విషయయాలను గుర్తుచేశారు. యావత్ ప్రపంచమే తెలంగాణ పథకాలను విని అబ్బురపోయి అభినందిస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే అత్యధికంగా వ్యవసాయం సాగుచేసే పంజాబ్ రాష్ట్రం కంటే ఎక్కువ ధాన్యం పండిస్తున్నట్లు తెలిపారు. కానీ, సహాయం చేయాలన్సిన కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిస్తుందని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపట్టారని, ఆ పథకం అంచెలంచెలుగా ప్రతిఒక్కరికీ అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు యువకులు, మహిళలతో మాట్లాడించి వారు పేర్లు, ఫోన్ నెంబర్లు, ఏం చేస్తున్నారు, వారి కుటుంబ వివరాలను, పరిస్థితులను స్వయంగా అడిగా నమోదు చేసుకున్నారు. సమావేశానికి వ్యవసాయాధికారులు రాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాయిపల్లిలో ఎమ్మెల్యే ఆలకు పూలవర్షంతో స్వాగతం ఫలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, ఎంపీపీలు దోనూరు నాగార్జునరెడ్డి, గూపని కళావతికొండయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉంద్యాలలో దళితబంధుపై అవగాహన
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 1: దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిన్నచింతకుంట మండలం ఉంద్యాలలో 6వ వార్డులో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని దళితవాడలోని తిరిగి వారి ఆర్థిక స్థితిగతులు పరిశీలించి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అట్టడుగు వర్గాల దళితుల ఆర్థిక స్వాలంబన కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం వారికి ఎంతగానో దోహదపడనున్నదని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. దళితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరీ, సింగిల్‌విండో అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు కరుణాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాము, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.