Couple Friendly Movie | టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన పుట్టినరోజుకు సంబంధించి గూగుల్లో సరైన వివరాలు లేకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సంతోష్ కూడా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అయితే సంతోష్ శోభన్ జూలై 12, 1995న జన్మించారు. ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన సంతోష్, ఇప్పుడు టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న సంతోష్ శోభన్, తన కెరీర్ మరియు వ్యక్తిగత నిర్ణయాల గురించి మాట్లాడారు.
కంబ్యాక్ కోసం కాదు.. క్లారిటీ కోసమే!
చాలామంది నటులు ఫెయిల్యూర్స్ వస్తే కంబ్యాక్ ఇవ్వడానికి బ్రేక్ తీసుకుంటారు. కానీ సంతోష్ శోభన్ మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. “నేను బ్రేక్ తీసుకున్నది కంబ్యాక్ ఇవ్వడానికి కాదు.. కెరీర్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి. ఆ స్పష్టతతోనే మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను” అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం గురించి మాట్లాడుతూ.. బ్యాగ్రౌండ్ వల్ల ఇండస్ట్రీలో కొంతవరకు అవకాశం వస్తుంది కానీ, అంతిమంగా ప్రేక్షకుల నుండి ఆదరణ రావాలి. ఆ గుర్తింపు కోసమే నేను కష్టపడుతున్నాను అని వెల్లడించారు. అయితే బ్రేక్ తర్వాత తను చేయబోయే సినిమా విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు సంతోష్ తెలిపారు. సినిమా చేయాలి అనుకున్నప్పుడు చాలా నిజాయితీగా (Honest) ఒక కథను చెప్పాలి అనుకున్నాను. ఆ సమయంలోనే నా దగ్గరకు ఒక ‘కపుల్ ఫ్రెండ్లీ’ స్క్రిప్ట్ వచ్చింది. చాలా మంచి కథను నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం అని తన తాజా ప్రాజెక్ట్ గురించి వివరించారు.
మరోవైపు వరుస ప్రాజెక్టులతో సంతోష్ శోభన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ముందుకు సాగుతున్న సంతోష్, ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.