గుండె సంబంధిత వ్యాధుల గురించి నిత్యం వింటూనే ఉంటాం.. గతంలో 60 ఏండ్లకు పైబడిన
వ్యక్తుల్లో, ఊబకాయం, శారీరక శ్రమచేయని వారిలో, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారిలో, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో వచ్చేది. కానీ ఆహారపు అలవాట్ల కారణంగా నేడు గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అందుకే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవడంతోపాటు ఒత్తిడిని తగ్గించుకోవాలని గుండెవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ
ఒకప్పుడు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల గురించి వినడం, చూడడం అనేది చాలా అరుదుగా ఉండేది . కానీ ఈ రోజుల్లో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులను రోజూ వింటూనే ఉన్నాం. వాస్తవానికి పూర్వం గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు అనేవి 60 ఏండ్లు పైబడిన వ్యక్తులకు , ఊబకాయం ఉండి శారీరక శ్రమచేయని వారికి, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారికి, బీపీ, షుగర్లాంటి లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో కనిపించేవి. అలాంటిది ఇప్పుడు లింగభేదం, వయస్సు, ఉబకాయం అనే తేడాలు లేకుండా గుండెవ్యాధుల బారిన పడుతున్నారు. రోజు రోజుకూ గుండె సంబంధిత వ్యాధులతో సంభవించే మరణాల సంఖ్య పెరిగిపోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుండె రక్త నాళాల జబ్బులతో మరణించే వారి సంఖ్య మన దేశంలో 31 శాతంగా నమోదవుతున్నది. ఈ వ్యాధి బారిన పడి మరణించేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నందున ఏ చిన్న లక్షణం కనిపించినా వెంట నే గుండె వ్యాధుల నిపుణులను సంప్రదించాలని, సకాలంలో సమయంలో చిక్సిత తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. గుండె వ్యాధులు రాకుండా ఉండేందుకు తమ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకొని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒత్తిడిలేని జీవితాన్ని గడిపేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శారీరకంగా ప్రతిరోజూ వారి దినచర్యల్లో చేసే శ్రమే ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారు.
లక్షణాలు
గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గుండె దగ్గరే కాకుండా వేరే శరీర భాగాల్లో ఎక్కడైనా కలుగవచ్చు. ముం దుగా ఈ గుండెవ్యాధి సంబంధిత లక్షణాలను తెలుసుకొంటే గుండెపోటు, గుండెవ్యాధులతో సంభవించే మరణాలను అరికట్టవచ్చునంటున్నారు వైద్యులు. గుండె సంబంధిత వ్యాధులతో చాలా అరుదైన భౌతిక మార్పులు సంభవిస్తాయి. అందులో భాగంగా రక్తప్రసరణలో మార్పు, చేతి, కాలివేలి గోళ్లు, జుట్టులో అసాధారణ మార్పులు కలుగుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగడం, గుండె, ఛాతి భాగంలో కండరాల నొప్పి, కాళ్లలో తిమ్మిర్లు, పక్షవాతం వచ్చినట్లు అనిపించడం, ఎలాంటి సూచనలు లేకుండా మూర్ఛ వచ్చి పడిపోవడం, నాడి పెరిగిపోవడం, గందరగోళంగా అనిపించడం వీటితో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటిలో చర్మం నీలి రంగులోకి మారిపోవడం, కొన్ని సమయాల్లో కాళ్లు, చేతులు అధికంగా వేడికి గురవుతాయి. ఛాతిలో నొప్పి, అలసట, ఉదర భాగంలో, కాళ్లకు వాపులు రావడం, ఎడమ ఛాతి భాగంలో నొప్పితోపాటు ఎడమ చేయి గుంజడం లాంటి లక్షణాలు ఉంటాయి. పైలక్షణాలు ఉంటే ముందుగా గుండె వైద్య నిపుణులను సంప్రదిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణాలు
గుండెపోటు, గుండె సంబంధిత ఇతర వ్యాధులన్నీ ముఖ్యంగా కొవ్వు పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవడం, పొగ తాగడం, వాతావరణంలోని కాలుష్యాన్ని పీల్చుకోవడం, బాల్యం నుంచి ఊబకాయం ఉండడం, రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్తులు, మధుమేహం అదుపులో ఉంచుకోకపోవడంతోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ . ముఖ్యంగా రోజువారి జీవితంలో శారీరక శ్రమలేకపోవడం కారణంగానే ఎక్కువ శాతం మంది వయస్సు, లింగభేదంతో పనిలేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారినపడి సగటు జీవితంతో సరిపెట్టుకుంటున్నారు.
ఒత్తిడితో గుండె సంబంధిత వ్యాధులు
రోజు వారి కృత్యాల్లో భాగంగా మనుషులు బిజీ బిజీ జీవితం అంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తీవ్ర ఒత్తిడి వయస్సుతో పని లేకుండా గుండె పై భారం పడి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి జీవితానికి స్వస్తి పలికి తాము తీసుకొనే ఆహారంలో కూరగాయలు ,పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తరచూ చేపలను తినాలి. తీసుకొనే ఆహారంలో నూనె, కారం, ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ముఖ్యంగా వ్యా యామం ప్రతిరోజూ కచ్చితం గా చేయాలి. దీంతో గుండె వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
పొగతాగడం మానుకోవాలి
పొగతాగడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు తొందరగా వస్తాయి. అలవాటు ఉన్నవారు పొగతాగడం మానుకోవాలి. వాతావరణ కాలుష్యం కారణంగా కూడా గుండె జబ్బులు వస్తాయి. మానసికంగా కావాల్సిన చిన్నాచితక విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి గుండె వ్యాధుల కారణమవుతున్నది. బరువు పెరుగకుండా చూసుకొంటూ కొవ్వు, నూనె పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరి ఆరోగ్యం వారి చేతిల్లోనే ఉంది. రసాయనిక ఆహార పదార్థాలు తీసుకోవడంతో కూడా గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్వంటి భయానకమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ముఖ్యంగా మనం నిత్య జీవితంలో తీసుకొనే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొంటే మంచిది. ఇందులో భాగంగా నూనె, కొవ్వు పదార్థాలు తక్కువ తీసుకోవాలి. పొగ తాగడం మానుకోవాలి. పొగ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ లాంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. శరీర బరువును పెరగకుండా చూసుకోవాలి. కారం, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. వ్యాయామం ప్రతిరోజూ విధిగా చేయాలి. రోజు ఐదు రకాల పండ్లను తినాలి. అల్కహాల్ అధిక మోతాదులో తీసుకోకూడదు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే వాటితో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. తరచూ బీపీ, షుగర్ పరీక్షలు, కొవ్వుశాతం తెలుసుకొనే(లిఫిడ్ ప్రొఫైల్)పరీక్షలను చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తే గుండె సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.