
ఖమ్మం కల్చరల్, జనవరి 13: సూర్యుడు ఆది పురుషుడు. అందుకే సూర్యనారాయణ మూర్తి అంటారు. ఆదికాలం నుంచి మానవుడు సూర్యుణ్ని ఆరాధిస్తున్నాడు. సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో సంచరిస్తాడు. కర్కాటకం నుంచి ధనుస్సు వరకు గల ఆరు రాశులను దాటి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. కర్కాటకం నుంచి ధనుస్సు వరకు సూర్య సంచార కాలం దక్షిణాయనం అంటారు. సూర్యుడు మకర సంక్రమణం చెందే సమయం ఎంతో పవిత్రమైనది. అంతకంటే ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. పురాతన పరంపర నుంచి కొత్తదనంలోకి పరిణితి చెందడమే సంక్రమణం. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి పండుగ. చెడును దహనం చేసి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగలోని అంతరార్థం. సంక్రాంతి పర్వం ముందు రోజు వచ్చే పండుగ కాబట్టి దీన్ని భోగి పండుగగా చెబుతారు. హేమంతపు వణికించే చలిలో నులి వెచ్చని భోగి మంటలు తనువును, మనసును సేదతీరుస్తాయి. పుష్య బహుళ త్రయోదశి ఈనెల 14 శుక్రవారం భోగి పండుగను జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. మొదటి రోజు శుక్రవారం భోగి, రెండో రోజు శనివారం సంక్రాంతి, మూడో రోజు ఆదివారం కనుమ జరుపుకోనున్నారు. దక్షిణాయాన్ని సాగనంపి, ఉత్తరాయణంలోకి కాలగతిని ప్రవేశపెట్టడానికి సన్నద్ధం చేసే మహత్తర పర్వం భోగి. ఇప్పటికే గంగిరెద్దుల విన్యాసాలు సందడి చేస్తున్నాయి. హరిదాసుల కీర్తనలు మార్మోగుతున్నాయి. రంగవల్లుల పోటీలతో వీధులన్నీ రంగులమయమవుతున్నాయి.
భోగ భాగ్యాల భోగి..
భోగ్యమంటే సుఖం, ధనం, ధాన్యం, రక్షణ. ఆ విధంగా లభించిన భోగ్యాలను అనుభవించేవాడు భోగి. ఆరోగ్యం, ఆయువు, శాంతి, ఆనందం కలగడానికి భోగి పండుగను జరుపుకుంటారు. దక్షిణాయనంలో చేసిన పాపాలన్నీ గుట్టగా పోసి దహనం చేస్తే.. పుణ్యకాలమైన ఉత్తరాయణం మంచి జీవితం ఇస్తుందని నమ్మకం. పాత వ్యవస్థలోని చెడును మంటల్లో కాల్చి, సజీవతత్వాన్ని గ్రహించి, గుణాత్మక పరివర్తనం చేయడమే భోగి మంటల పరమార్థం. ఈ రోజున ఉదయమే ఇళ్లముందు, కూడళ్లలో మంటలు పెట్టి పాత వస్తువులను అందులో కాల్చి బూడిద చేస్తారు. ఈ మంటల్లో పాత వస్తువులను కాల్చి, చెడును వదిలించుకుని మంచికి శ్రీకారం చుట్టనున్నారు. తెలియక చేసిన చెడు పనులేమైనా ఉంటే వాటిని తమ నుంచి దూరం చేయనున్నారు. భోగి రోజున ఇండ్లను మామిడితోరణాలతో అలంకరిస్తారు. వాకిట్లో సప్తవర్ణాల్లో రథాల ముగ్గులు పెడతారు. వాటిలో గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి సూర్యుడిని మకర రాశిలోకి ఆహ్వానిస్తారు. భోగి రోజున పిల్లలకు రేగిపళ్లు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. శాస్త్రీయతకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉండే రేగిపళ్లను నాణేలు, చెరకు ముక్కలతో కలిపి శాస్త్రోక్తంగా చిన్నారుల తలలపై పోసి ఆశీర్వదిస్తారు. బొమ్మల కొలువులు, పేరంటాలు నిర్వహించి మహిళలు వాయనాలను పరస్పరం
ఇచ్చిపుచ్చుకుంటారు.
నెల రోజుల నుంచి పవిత్రంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన భక్తులు.. రంగనాథ స్వామికి ప్రతి రోజూ చక్కెర పొంగళిని నైవేద్యాలుగా సమర్పించారు. పవిత్ర ధనుర్మాస మహోత్సవంలో ఆండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్ని ముగించుకోవడంతో భోగి పండుగ రోజున అన్ని వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణం కమనీయంగా జరుగుతుంది. హరిదాసులు భగవన్నామ సంకీర్తనలతో సంచరిస్తారు. పిల్లలు గాలి పటాలతో ఆనంద కేళి చేస్తారు. ఆడపిల్లలు గోరింటాకులు, పట్టువస్ర్తాలతో సంప్రదాయంగా పండుగకు ప్రతిబింబంగా ముస్తాబవుతారు. ఈ పండుగకు పరమాన్నంతోపాటు ప్రతి ఇంటా నోరూరించే పిండి వంటలు ఘుమఘులాడుతాయి. బూరెలు, అప్పాలు, బొబ్బట్లు, అరిసెలు, చకినాలు, కారప్పూసలతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆనందోత్సాహాలతో ఆరగిస్తారు.
కనుమ.. రైతన్నల పండుగ..
సంక్రాంతి.. వ్యవసాయ ప్రధానమైన పండుగ. ఇది రైతుల జీవన విధానంతో ముడిపడి ఉంది. రైతన్న ప్రకృతిలోని సుఖ దుఃఖాలను పొందుతాడు. పంట వేసి, కలుపు తీసి, కోత కోసి, ధాన్యం ఇంటికి రాగానే ఆనంద పరవశం చెందుతాడు. వరి, కందులు, పెసలు, బొబ్బెర్లు, ఇతర మెట్టపంటల దిగుబడులతో ధాన్యరాశులు ఇండ్లల్లో తులతూగుతాయి. ఈ సందర్భమే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు.
ట్యాంక్‌బండ్‌పై సంబురాలు..
రెండేళ్లపాటు ప్రజలను అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి కాస్త ఉపశమనం వచ్చిందన్న తరుణంలో కొత్త వేరియంట్ మళ్లీ వ్యాపిస్తోంది. ఆందోళన ఉన్నప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సంబురాలు జరుపుకుంటున్నారు. నగరంలో అత్యంత శోభాయమానంగా ముస్తాబైన లకారం ట్యాంక్‌బండ్‌పై సంబురాలను నిర్వహించనున్నారు. పతంగుల పోటీలు, తినుబండారాలు, బోటింగ్లతో ఆనంద కేళీ చేయనున్నారు. ఇటీవల నిర్మించిన తీగల వంతెన జిల్లాకే నూతన శోభను తెచ్చిపెట్టింది. లేజర్ కాంతులతో రంగుల మయం చేస్తూ నగర వాసులకు రంగుల క్రాంతిని వెదజల్లుతోంది.