రోజుకో రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్నదాతల ఉసురు తీసుకుంటోందని, తెలంగాణ ఉద్యమం తరహాలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడుదామని రైతులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఏడేండ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ రైతుల పాలిట రాక్షస పార్టీగా మారిందని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారం చేపట్టిన ప్రధాని మోదీ, ఇప్పుడు పెట్రో,డీజిల్, ఎరువుల ధరలు పెంచి వ్యవసాయ పెట్టుబడులు రెట్టింపు చేశారన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ప్రధాని మోడీ రైతులను మింగే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సిద్దిపేట, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోజుకో రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటూ బీజేపీ సర్కారు అన్నదాతల ఉసురు తీసుకుంటుందని, దేశాన్ని ఏడేళ్లుగా పాలిస్తున్న బీజేపీ రైతుల పాలిట రాక్షస పార్టీగా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శంచారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంపై మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. రైతులపై బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దామని రైతులకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు నిత్యం ఏదో ఒక రైతు వ్యతిరేక విధానాన్ని ప్రకటిస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నదన్నారు. నిన్నటికి నిన్న మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుల నుంచి వ్యవసాయన్ని కార్పోరేట్ శక్తుల చేతిలో పెట్టే కుట్ర చేసిందన్నారు. ఏడాది పాటు రైతులు రోడ్డెక్కెలా చేసి వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. బృందాలుగా ఏర్పడి రైతులపై దాడిచేయాలని కిసాన్ మోర్చా సమావేశంలో హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పిలుపునిచ్చారని, అలాంటి సీఎం బీజేపీలో ఉండడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తమ కార్యకర్తలను రైతులపైకి ఉసిగొల్పిన రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అన్నారు.
ఏడేండ్లలో బీజేపీ రైతులకు చేసిందేమిటి..?
పెట్రో, డీజీల్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచి వ్యవసాయ రంగంలో యంత్రాలు వాడే రైతులకు ఖర్చు రెట్టింపు చేసిందని, అలాగే బాయిలకాడ, బోర్ల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టి రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం, పండిన పంటను అమ్ముకునే మార్కెట్లను మూసేయడం, పండిన పంటను మేము కొనుగోలు చేయమని, తాజాగా ఎరువుల ధరలు పెంచడం.. ఇవి తప్ప ఈ ఏడేండ్లలో రైతులకు బీజేపీ ఏం చేసిందో సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా, రైతుల పెట్టుబడి రెండింతలు చేసి వారి ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన బీజేపీ, దేశంలో ఒక్క రూపాయి అయినా రైతులకు రుణమాఫీ చేసిందా అని అన్నా రు. రైతులకు ఏం చేయని బీజేపీ నేతలు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, మొసలి కన్నీరు కారుస్తూ ఓట్ల రాజకీయానికి తెరలేపారని విమర్శించారు. రైతుల ఓట్లు కావాలని కానీ, రైతుల ప్రయోజనాలు అవసరం లేదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతే రాజు కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అహోరాత్రులు ఆలోచించి రైతులకు మేలు చేసే అనేక గొప్ప పథకాలు ప్రారంభించారన్నారు. రైతుబంధు కింద దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ.50 వేల కోట్ల పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌దే అన్నారు.
కేంద్రంపై రాజీలేని పోరు..
తెలంగాణ ప్రభుత్వం రైతును రాజుగా మార్చాలని ప్రయత్నిస్తుంటే, బీజేపీ రైతును అన్ని విధాలుగా నిస్సహాయులుగా చేసే విధానాలు అమలు చేస్తుందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తద్వారా రైతు వ్యవసాయం వదిలిపెడితే, ఆ రంగాన్ని కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. బీజేపీ పాలకుల కార్పొరేట్ కుట్రలను రైతులు గమనించి వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గోముఖ వ్యాఘ్రంలా బీజేపీ రైతుల వద్దకు వస్తున్నదని, వారి అసలు రంగు వారి విధానాలే బయటపెడుతున్నాయన్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులంతా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి రైతుల హక్కులు కాపాడుకుందామని, ఈ రైతు హంతక బీజేపీని గద్దె దించుదామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గల్లీలో అయినా ఢిల్లీలో పోరాటానికైనా వెనుకాడేది లేదని.. నాగలి ఎత్తుదాం.. రైతు పోరాట శక్తిని ఢిల్లీ ప్రభుత్వానికి చూపిద్దామన్నారు. ఎరువుల ధరలు తగ్గించే దాకా ఆందోళన సాగిస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
నరహంతక పార్టీ బీజేపీ..
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతుల మీద స్వయంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు కారు ఎక్కించి చంపితే, ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా చేసిందే అని దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చితే, ఎలాంటి చర్య తీసుకోని నరహంతక పార్టీ బీజేపీ అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలని రద్దు చేసినట్లు బీజేపీ ప్రభుత్వం నాటకాలడిందన్నారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మూడు చట్టాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తీసుకుందని, అయితే అది మళ్లీ ముందుకు వెళ్లడం కోసమే అని చెప్పినట్లు గుర్తుచేశారు. తిరిగి ఎన్నికల తరువాత రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు అమలు చేస్తామని చెప్పారని.. ఇది బీజేపీ రైతుల పట్ల కార్చే మొసలి కన్నీరుకు ఉదాహరణ అని మంత్రి అన్నారు. కేంద్రం 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఎన్నికల కోసం దొంగ వాగ్ధానాలు బీజేపీ నేతలు చేశారన్నారు. కానీ, కేంద్రం చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పనంగా అప్పగించే నల్ల చట్టాల అమలుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భారతీయ జూటా పార్టీ బీజేపీ రైతుల నడ్డి విరిచేలా పెట్టుబడి ఖర్చును రెండింతలు చేసిందని విమర్శించారు. ఎరువుల ముడి సరుకు ధరలు పెరిగితే వాటిని భరించాల్సిన కేంద్రం, తన భాద్యతను విస్మరించి ఆ భారాన్ని రైతుల మీద మోపడం తగదన్నారు. ఇప్పటికే కుదేలైన రైతాంగం ఈ భారాన్ని ఎలా మోయగలదో బీజేపీ నేతలు స్పష్టం చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బీజేపీ పాలిత రాష్ర్టాలో తెలంగాణ తరహా పథకాలేవీ..
రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఒక్కో వ్యవసాయ పంపు సెట్‌కు ప్రతి ఏడాది రూ.18,167 విద్యుత్ రాయితీ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం మోస్తున్నదని తెలిపారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనూ ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఉచితంగా కరెంటు ఇస్తే ఆ రాష్ట్రం పేరు చెప్పాలని సవాల్ విసిరారు. 2019 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు వ్యవసాయ రంగానికి రూ.33,125 కోట్లు, 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూ.23,889 కోట్లు ప్రభుత్వ కేటాయించిందని, ఇంత మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఖర్చు చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రూ.2.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. రైతు చనిపోతే వారి కుటుంబాల ఆత్మైస్థెర్యం, ఆత్మగౌరవం దెబ్బతినేలా ఇక్కడి రాజకీయ నేతలు మాట్లాడారని, కానీ.. సీఎం కేసీఆర్ వారి ఆత్మగౌరవం నిలబెట్టేలా, ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు ఏ కారణంతో చనిపోయినా ఐదు లక్షల బీమా పదిరోజుల్లో వారి ఇంట్లో అందేలా రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీజేపీ ఎక్కడైనా ఇలాంటివి అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని ఐదేండ్లుగా ప్రధాని మోదీని కోరుతున్నామని, అయినా పట్టించుకోలేదన్నారు. రైతులకు లాభం చేసే ఏ చర్యను బీజేపీ ప్రభుత్వం తీసుకోలేదన్నారు.