యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర మొండివైఖరి, రైతు వ్యతిరేక విధానాలు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత వ్యాఖ్యలు.. రైతులు, మంత్రులను అవమానపర్చేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ గులాబీ దళం మలి పోరుకు సిద్ధమైంది. మొదటి విడుతగా వారం రోజులపాటు నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడినా చలనం లేకపోవడంతో మారోమారు కేంద్రం తీరును ఎండగట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మాత్యులు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమపంథాలో నిరసనలు ఉండాలని, కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలేలా రాస్తారోకోలు, ర్యాలీలు, దీక్షలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నేటి నుంచి మంత్రి, విప్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పోరుకు సిద్ధమయ్యారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : : యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. పంజాబ్, హర్యానా రాష్ర్టాల వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని మాత్రం నిరాకరిస్తున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పిలుపుమేరకు మొదటి విడుతగా బీజేపీ వైఖరికి నిరసగా ఆందోళనలు చేపట్టారు. మార్చి 25వ తేదీ నుంచి 31 వరకు పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, రైతుబంధు సమితి, పీఏసీఎస్, డీసీఎంఎస్, డీసీసీబీ, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని తీర్మానాలు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపించారు.
వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతుల తరఫున టీఆర్ఎస్ పోరుబాట పట్టినా కేంద్ర సర్కారు మొద్దునిద్ర వీడడం లేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల బృందం కలిసి విన్నవించినా అవమాన పర్చేలా మాట్లాడారు. నూకలు తినిపించడం అలవాటు చేసుకోండని హేళనగా మాట్లాడారు. తెలంగాణ సమాజా న్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు భగ్గుమన్నారు. కేంద్ర ప్రభుత్వ, మోదీ, పీయూష్ గోయల్ దిష్టిబొమ్మల దహనాలు చేసి నిరసన తెలిపారు. అయినప్పటికీ చలనం లేకపోవడంతో టీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖ మాత్యులు కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలా కార్యాచరణ రూపొందించారు. కేంద్రపై ఒత్తిడి పెంచి కొనుగోలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతారు. ఈ నెల 6న నాగ్‌పూర్ జాతీయ రహదారి దిగ్బంధనం ఉంటుంది. 8న గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు. 11న ఢీల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరుగుతాయి. టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనలకు రైతులు, ప్రజలు, సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి.
ఏప్రిల్ 4 : మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
ఏప్రిల్ 6 : జాతీయ రహదారులపై రాస్తారోకో
ఏప్రిల్ 7 : జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళనలు..
ఏప్రిల్ 8 : గ్రామాల్లో నిరసనలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాల ఎగురవేత. మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు.
ఏప్రిల్ 11 : ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష