రఘునాథపాలెం, అక్టోబర్ 6: డప్పు చప్పుళ్లు.. యువతీ యువకుల కోలాటాలు.. చిన్నారుల కేరింతలు.. అదిరేటి డీజే శబ్ధాల నడుమ దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర గురువారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో కన్నుల పండువగా సాగింది. శోభాయాత్ర సందర్భంగా ఉత్సవ కమిటీలు ధరించిన ఒకే రకమైన దస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు ప్రాంతాల్లో విచిత్ర వేషధారణలతో యువకులు భక్తులను ఆకట్టుకున్నారు. శోభాయాత్రను పురస్కరించుకొని అమ్మవారిని సైతం ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల విశేష పూజలందుకుని తమ తమ ఇళ్ల ముంగిటకు వచ్చిన ‘దుర్గమ్మ’ తల్లిని భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కుకున్నారు.
దుర్గమ్మ తల్లి శోభాయాత్రగా వచ్చిన వాహనానికి నీళ్లు పోసి దండం పెట్టుకున్నారు. టెంకాయలు, గాజులు సమర్పించి ఆశీర్వచనాలు అందుకున్నారు. పాండురంగాపురంలో శ్రీ రామలింగేశ్వర ఆలయం ఉత్సవ కమిటీ ఆడిన దాండియా ఆటలు, డీజే శబ్ధాల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శోభాయాత్రను పురస్కరించుకొని ఖమ్మం అర్బన్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)2వ డివిజన్ అధ్యక్షుడు నర్రా యల్లయ్య, ఆలయ కమిటీ చైర్మన్ బోయిన కృష్ణ, ప్రధాన కార్యదర్శి బత్తిని ఉపేందర్, ఉపాధ్యక్షుడు కుర్రా మాధవరావు, కోశాధికారి కృష్ణమాచారి, శీలం శ్రీనివాసరావు, ఉపేంద్రాచారి, బోయిన సురేశ్, మోరం వీరన్న, గోపి, యల్లంకి నర్సింహారావు, తిరుపతిరావు, కృష్ణారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.