తెలంగాణలో ఇలా..
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రైతుబంధుతో కర్షకులకు పెట్టుబడి కష్టాలను తీర్చింది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రైతుబీమాతో అన్నదాతల్లో ధీమా నిం పింది. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుండడంతో రెండు పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. గత పాలకుల హయాంలో దండుగగా మారిన వ్యవసాయాన్ని పండు గలా చేస్తున్నది. ఇలా పలు పథకాలతో కర్షక సంక్షేమ రాజ్యంగా పరిఢవిల్లుతున్నది.
ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నది. సాగునీటి కోసం అరిగోస పడుతున్నది. సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతు న్నారు. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు లేకపోవడంతో రైతులు పెట్టుబడులు తీసుకురా లేక సాగును భారంగా భావిస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుం టున్న రైతు వ్యతిరేక విధానాలతోనే అన్నదాతలు కాడి ఎత్తేసే పరిస్థితి తలెత్తుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట నియోజ కవర్గంలో పర్యటించగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అక్కడి రైతుల సాగు కష్టాలు, ప్రభుత్వ విధానాలతో సాగుకు దూరమవుతున్న కర్షకుల వేదనపై ప్రత్యేక కథనం మీకోసం..
ఖమ్మం, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సాగునీటి వసతి, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, పెట్టుబడి సాయం వంటి పథకాలు లేని కారణంగా రైతులు క్రమంగా సాగుకు దూరమవుతున్నారు. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ‘నమస్తే తెలంగాణ’ బృందం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట నియోజకవర్గంలో పర్యటించి వివరాలు సేకరించింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు దాటినప్పటికీ రుణమాఫీ చేయలేదని ఇక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పవిత్ర గంగాజలంతో ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమ రాష్ర్టానికీ ఉండాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఉద్యమకారుడిగా ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాబట్టే ప్రజల కష్టాలు తీరుస్తున్నారంటున్నారు. కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తెలంగాణకు వరప్రసాదంగా అందించారని కొనియాడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ సర్కారు ఏ మాత్రం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్ధ్దానాలను నెరవేర్చడం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతాంగాన్ని కూడగట్టేందుకు ఇక్కడి సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలోని మారాయిగూడెం, కుంట ప్రాంతాల్లో రైతులు కేవలం వానకాలంలోనే పంటలు సాగు చేస్తున్నారు. తలాపునే గోదావరి పారుతున్నా తాగునీరు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో అతివృష్టి లేదా అనావృష్టి సర్వసాధారణంగా మారింది. అయితే కుండపోత వానలు. లేకపోతే ఏడాది పొడవునా కరువు. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఒక్క ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతంలో లేదు. తెలంగాణలో మాదిరిగా ఛత్తీస్‌గఢ్‌లోనూ రైతుబంధు పథకం అమలు చేయాలని ఇక్కడి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంటల పెట్టుబడికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రాల్లో ఎలాంటి వసతులు ఉండవని, ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకెళ్లిన సమయంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సాగునీటి వసతి లేదు. దీంతో రైతులు ఏడాదిలో కేవలం ఒక్క పంట మాత్రమే సాగుచేస్తున్నారు. అది కూడా వానకాలంలోనే.
ఛత్తీస్‌గఢ్‌లో రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు రూ.2,500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేయడంలో మాత్రం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.2,500 కూడా ఒకేసారి ఖాతాలో జమ కావడం లేదని, మద్దతు ధర రూ.1800 మాత్రమే జమ చేసి మిగతా మొత్తాన్ని మాత్రం జమ చేయడం లేదంటున్నారు. తెలంగాణలో వరదలు వస్తే ప్రభుత్వం తక్షణం స్పందిస్తుందని, రైతులకు అండగా నిలుస్తుందని ఇక్కడి రైతులు వెల్లడిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది గోదావరి పొంగి పంటలు మునిగిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. రైతులకు నష్టపరిహారమంటే ఏమిటో తెలియని పరిస్థితి నెలకొన్నది. సుకుమ, కాంకేర్, బీజాపూర్ జిల్లాల్లో గతేడాది వేలాది ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అంచనాలు రూపొందించిందని, పరిహారం మాత్రం ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ర్టాలకు విద్యుత్ విక్రయించే రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌కు పేరున్నది. కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం సాగుకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదు. రోజుకు 8 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం చూపడం లేదు. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పైగా పంటలకు వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్‌కు రైతులు బిల్లు చెల్లించాల్సిందే. బిల్లు చెల్లిస్తున్నా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్ల ద్వారా వ్యవసాయం చేయాలనుకునే వారికి కరెంట్ బిల్లులకు సిద్ధంగా ఉండాల్సిందే. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించకపోయినా రైతులు సాగు చేసుకునేందుకు వీలుగా బోర్లు వేసుకోవడానికి అనుమతులు ఇచ్చేవి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రం బోరు వేయడానికి అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నది. దరఖాస్తు చేసుకుని ఆరునెలలు దాటినా అనుమతులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ధాన్యం క్వింటాకు రూ.2,500 ఇస్తామని ప్రకటించిన సర్కార్ బ్యాంకు ఖాతాల్లో అలా జమచేయడం లేదు. బ్యాంకులో ఎప్పుడు, ఎంత డబ్బు జమ అవుతుందో తెలియని పరిస్థితి. మూడు విడతలుగా జమ చేస్తున్నది. దీంతో సంవత్సరం పొడవునా అమ్మిన ధాన్యానికి రేటు ఎంతో తెలియడం లేదు. గతేడాది వరదల కారణంగా పంటలు మునిగిపోయాయి. రైతులు నష్టపోయారు. మా ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతం అంటూ ప్రభుత్వం ఖాళీ చేయమంటున్నది. భూపట్టాలు వెనక్కి ఇవ్వాలని వేధిస్తున్నది. నష్టపరిహారం అడిగితే స్పందించడం లేదు.
– సాగిరాజు సుబ్బరాజు, రైతు, కుంట
మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, సాధారణ ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అనేక వాగ్ధానాలు చేసింది. ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసింది. రైతులకు ఇక్కడ ఎలాంటి బీమా పథకం అమలుకావడంలేదు. తెలంగాణలో రైతు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఇస్తున్నారని తెలుసుకున్నాం. ప్రతి సీజన్లో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం ఇస్తున్నారని తెలిసి ఆనందించాం. ఇలాంటి పథకాలు మా రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో వృద్ధాప్య, వితంతు పింఛను రూ.2016 ఇస్తుండగా ఇక్కడ కేవలం రూ.300 ఇస్తున్నది. ఏ విషయంలో చూసినా తెలంగాణ నంబర్‌వన్.
– మూకా, బీజేపీ రాష్ట్ర నాయకుడు, కుంట, ఛత్తీస్‌గఢ్
మూడున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరిగింది ఏమీలేదు. పది రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి మూడున్నరేళ్లు గడిచినా అతీగతీ లేదు. వరదలకు పంటలు మునిగినా నష్టపరిహారం ఇంతవరకు ఏ ఒక్క రైతుకు అందలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మాదిరిగా రైతుబంధు పథకం, రైతు రుణమాఫీ కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ ఏ ఒక్క పథకం ఇక్కడ అమలుకావడంలేదు. వరి ధాన్యం క్వింటాకు రూ.2500 మద్దతు ధర ఇస్తానని చెప్పి కేవలం రూ.1800 మాత్రమే ఇస్తున్నారు. మొక్కజొన్నకు కూడా సరైన ధర ఇవ్వడంలేదు. మరోపక్క కరెంటు ఇక్కడ ఎప్పుడు వస్తుందో…పోతుందో తెలియదు. వర్షాధారం మీదనే పంటలు సాగుచేయాల్సిన దుస్థితి.
– అల్లం శ్రీధర్, రైతు, కుంట
గోదావరి పక్కనే పోలవరం ఉండడంతో ఏటా వరదలు పండిన పంటలను ముంచెత్తుతున్నాయి. వరద నష్టం అంచనా వేసేందుకు సర్వే బృందాలు వచ్చినా మూడున్నరేళ్లలో ఏ ఒక్క రైతుకూ పంట నష్ట పరిహారం అందలేదు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా సాయం చేస్తున్నది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పాలనలో ఏ రైతుకు ఎలాంటి ఆదరణ లేదు. తెలంగాణలో వ్యవసాయం పండుగ. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం దండగలా మారింది. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు మాత్రం మా బాధలు పట్టడంలేదు.
– నోముల వెంకన్న, రైతు, కుంట