భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 9: నీతి ఆయోగ్ ఎంపిక చేసిన 112 యాస్పిరేషనల్ జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం విద్యావిధానంలో 3వ ర్యాంకు సాధించింది. దీనిపై కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సోమవారం ప్రకటించిన జాబితాలో మన జిల్లాకు 3వ స్థానం లభించినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో కలెక్టర్‌ను డీఈవో సోమశేఖరశర్మ, కార్యాలయం సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు.
దేశంలో నాణ్యమైన విద్య అందిస్తున్న ఐదు ఆకాంక్షిత జిల్లాల్లో తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడేనికి చోటు దక్కిందని కలెక్టర్ చెప్పారు. విద్యారంగంపై అధ్యయనం చేసిన నీతి ఆయోగ్.. డెల్టా ర్యాంకింగ్స్ 2022ను సోమవారం ప్రకటించినట్లు చెప్పారు. ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో బీహార్‌లోని ముజఫర్‌పూర్, ఒడిశాలోని మల్కాన్‌గిరి, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జార్ఖండ్‌లోని చత్ర, కర్ణాటకలోని యాద్గిర్లు ఉన్నాయని వివరించారు. కొవిడ్ లాక్డౌన్ కాలంలో విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించినట్లు చెప్పారు.
ఉపాధ్యాయులకు క్లస్టర్ విధులు కేటాయించి విద్యార్థులను దత్తత తీసుకొని విద్యార్థులు చదువుల్లో వెనుకబడకుండా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతమైన మన జిల్లాలో ఆన్లైన్ విద్యాబోధనలో అంతర్జాల సమస్య ఉన్న ప్రాంత విద్యార్థులపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని 100 పాఠశాలల్లో సీఎస్ఆర్ నిధులతో డిజిటల్ తరగతులు ఏర్పాటు ద్వారా విద్యాబోధన జరుగుతున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లా యాస్పిరేషనల్ పారా మీటర్లు అన్ని అంశాల్లో ముందంజలో ఉండాలని అన్నారు. ఇందుకోసం అన్ని శాఖల ఉద్యోగులు కృషి చేయాలని కోరారు.