ఖమ్మం ఎడ్యుకేషన్, మే 14: బీసీ యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, ఉద్యోగ అవకాశాలు పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని తెలంగాణ తల్లి సర్కిల్లో రూ.3.50 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ నీరజ, కలెక్టర్ వీపీ గౌతమ్‌లతో కలిసి మంత్రులు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ. బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని అన్నారు. బీసీ కులాలకు అన్ని విధాలుగా ఉపయోగపడేందుకు మరో రూ.రెండు కోట్లతో బీసీ భవనాన్ని నిర్మిస్తామన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌ను బీసీ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట: మంత్రి గంగుల అగ్రవర్ణాలతో సమానంగా బీసీ యువత ఉన్నత విద్యనభ్యసించి అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో రాష్ట్రంలో 281 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని అన్నారు.
సీఎం కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో స్టడీ సర్కిళ్ల నిర్మిస్తున్నారని అన్నారు. ఉద్యోగాల సాధనలో ఇంటర్వ్యూలు లేవని, పైరవీలకు తావులేదని మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, లెక్చర్ హాల్స్, స్టడీ రూమ్స్, డార్మటరీ వంటి సకల సౌకర్యాలతో బీసీ స్టడీ సర్కిల్‌ను నిర్మించామన్నారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత పాల్గొన్నారు.