కొత్తగూడెం అర్బన్, మే 14: మన ఆర్టీసీ.. ఇప్పుడు మనింటికే వస్తున్నది..! ఒకవైపు ఆదాయం పెంచుకునేందుకు, మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు సంస్థ ప్రయత్నిస్తున్నది. ‘ఆర్టీసీ మనది.. మనందరిదీ’ అని ప్రజలు భావించేలా, వారితో అనుబంధాన్ని పెంచుకునేలా సంస్థ ఉన్నతాధికారులు దారులు వెతుకుతున్నారు. అందులో భాగమే ‘మ్యాంగో ఎక్స్ప్రెస్’. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. మామిడి పండ్లను ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే సరికొత్త కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. దీనికి ‘మ్యాంగో ఎక్స్ప్రెస్’ అని పేరు పెట్టింది. కొత్తగూడెం రామాంజనేయ కాలనీకి చెందిన బండారి నాగేశ్వరరావు, ఆర్టీసీ కార్గో ఆన్లైన్లో బంగినపల్లి మామిడి పండ్లను ఆర్డర్ చేశారు.
కేజీ ధర రూ.115. ఐదు కేజీలు ఆర్డర్ చేశారు. జగిత్యాలలోని మామిడి రైతు నుంచి కొత్తగూడేనికి ఈ మామిడి పండ్ల బుట్టతో కార్గో బస్సు వచ్చింది. ‘మ్యాంగో ఎక్స్ప్రెస్’కు కొత్తగూడెం డిపో నుంచి మొట్టమొదటి కస్టమర్ బండారి నాగేశ్వరరావే. అందుకే, ఆర్టీసీ కొత్తగూడెం డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు ఆధ్వర్యంలో అధికారులు మంచానాయక్, సునీత, చిట్టిబాబు, శామ్యూల్, హనుమా, వైఎన్ రావు, నజీర్ కలిసి శనివారం ఆ మొదటి కస్టమర్ ఇంటికి వెళ్లి, మామిడి పండ్ల డబ్బా అందించారు.
అనుకోని అతిథులుగా తమ ఇంటికి వచ్చిన ఆ అధికారులను చూసిన నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు ముందు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే సంతోషంతో సాదరంగా ఆహ్వానించారు. మరిన్ని వినూత్న సేవలతో ఆర్టీసీని ప్రజలకు మరింత దగ్గరగా చేసేందు కు ప్రయత్నిస్తున్నామని, వారితో బం ధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ అధికారులు చెప్పారు.