మధిర రూరల్, మే 9: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’, మన బస్తీ- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం మండలంలోని ఇల్లూరు, ఖమ్మంపాడు, చిలుకూరు జిల్లా పరిషత్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, స్లాబ్‌పై కిచెన్‌షెడ్, డైనింగ్‌హాల్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండాలని, ప్రహరీ నిర్మాణ పనులు పాఠశాలల ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వై ప్రభాకర్, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, హెచ్ఎంలు పాల్గొన్నారు.
మధిర టౌన్, మే 9: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని బలోపేతం చేయాలని కలెక్టర్ గౌతమ్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం స్థానిక గర్ల్స్ హైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థుల హాజరు వివరాలను హెచ్ఎం శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. ప్రైమరీ పాఠశాలలో 240 మంది విద్యార్థులకు గాను ఉపాధ్యాయులు తక్కువ ఉండడంతో హైస్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్‌కు ఉపాధ్యాయులు ఆంజనేయులు, కళావతిని వెంటనే పంపాలని ఎంఈవో ప్రభాకర్‌కు సూచించారు. మడుపల్లి పాఠశాలను సందర్శించారు. అనంతరం శ్రీనిధి కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఎంఈవో ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, మే 9: ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాలుగు పాఠశాలలను కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం సందర్శించారు. ఎర్రుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెంకటాపురం యూపీఎస్, మామునూరు యూపీఎస్, అయ్యవారిగూడెం యూపీఎస్‌ను ఆయన సందర్శించారు. వెంకటాపురం యూపీఎస్‌లో సమస్యలను తెలుసుకున్నారు. సర్పంచ్, ఎంపీటీసీలతో మాట్లాడి పంచాయతీ తీర్మానం ఇప్పించాలన్నారు.
అయ్యవారిగూడెం యూపీఎస్‌లో 100 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండటమేమిటని, వెంటనే మరో ఇద్దరు టీచర్లను నియమించాలని ఎంఈవోను ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లకు బిల్డింగ్లు కేటాయించాలని, రాజులదేవరపాడు ఆర్అండ్బీ రోడ్డు జంక్షన్ ముందు రింగ్ ఏర్పాటు చేసేందుకు కృషిచేయాలని రాజులదేవరపాడు సర్పంచ్ సుధాకర్‌రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోఆర్డీ శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ నరేశ్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.