
పందేలకు కోళ్లు సై అంటున్నాయి. పైచేయి సాధించేందుకు కత్తులు దూస్తున్నాయి. గిరిగీసి బరిలో నిలిచి సవాల్ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో కోడి పందేలు జోరందుకుంటాయి. పందెం రాయుళ్లు కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జూదం కాస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, దమ్మపేట, దుమ్ముగూడెం, చర్ల, ఎర్రుపాలెం, మధిర, సత్తుపల్లి వంటి ప్రాంతాల్లో కోడి పందేలు పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఈ పందేల్లో రూ.లక్షల్లో చేతులు మారుతుంటాయి.
ఖమ్మం, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందెం రాయుళ్లకు పండగే. సంక్రాంతి సీజన్లో ఉమ్మడి జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, దమ్మపేట, దుమ్ముగూడెం, చర్ల, ఎర్రుపాలెం, మధిర వంటి ప్రాంతాల్లో కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహించేవారు. పండుగకు పది రోజుల ముందు నుంచే పందెం రాయుళ్లు సిద్ధమయ్యేవారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు పందేలపై ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రా ప్రాంతానికి తరలివెళ్తున్నారు. సత్తుపల్లి, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని సరిహద్దు మండలాలు, ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు పందెం రాయుళ్లు తరలివెళ్తున్నారు. పందేల సమాచారాన్న్లి ఫోన్ల ద్వారా తెలుసుకుని గంటల వ్యవధిలోనే అక్కడికి వెళ్తున్నారు. మామిడి తోటలు, నిర్మానుష ప్రాంతాలను నిర్వాహకులు పందేలకు వినియోగిస్తున్నారు.
ఎక్కడెక్కడ అంటే..
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం, సీతానగరం, పోతులూరు, ధర్మాజీగూడెం, చిత్తంపల్లి, వెంకటాపురం, పంచాలకుంట, ప్రగడవరం, కృష్ణా జిల్లాలోని తిరువూరు, కాకర్ల, విసన్నపేట ఇప్పటికే పందేలు జోరుగా నడుస్తున్నాయని సమాచారం.ఈ పందేలకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా పందెం రాయుళ్లు వెళ్తారు. కొప్పాక, భీమవరంలో సినిమా సెట్టింగులను మరిపించే విధంగా పందెం వేదికలు సిద్ధమవుతున్నాయి. పందెంలో సుమారు 50 రకాల కోళ్లు పాల్గొంటాయి. వీటిని పందేలకు రెండు నెలల ముందు నుంచే సిద్ధం చేస్తారు. వాటికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్స్ తినిపిస్తారు. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, టింగలి, బోజు, నల్లమచ్చం సేతువు, ఎర్రబోర, నల్లబోర, మైల, కొక్కిరాయి రకాల కోళ్లను పందేలకు వినియోగిస్తారు. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోళ్లు పందేలకు పెట్టింది పేరు.
కుక్కుట శాస్ర్తాన్నీ విశ్వసిస్తారు..
ఒక్కో పందెం కోడి ధర రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. బెట్టింగ్ కాసేవాళ్లే కాక పందేలను చూసేందుకు వచ్చేవారూ భారీ మొత్తాల్లో పందేలు కాస్తారు. వాటిని ‘పై పందేలు’ అంటారు. తెలుగు రాష్ర్టాల్లో ఐదు రకాల పందేలు నిర్వహిస్తారు. అవి చూపుడు, ఎత్తుడు, దింపుడు, ముసుగు, డింకి, కోసు పందేలు. వీటిలో డింకి పందెం మినహా అన్ని పందేల్లో పుంజుల కాళ్లకు కత్తులు కడతారు. కోడి పందేలు ఒక ఎత్తయితే రాత్రి పగలు తేడా లేకుండా పందేలు నిర్వహించడం మరో ఎత్తు. పందెం వేదికల వద్ద నిర్వాహకులు విద్యుత్ జనరేటర్లు సైతం ఏర్పాటు చేశారు. పందేల్లో రెప్పపాటులో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. పందెం రాయుళ్లు పందెంలో కుక్కుట శాస్త్రం, జాతకాలనూ అనుసరిస్తారు. కోడి పందేలు జరిగే ప్రదేశం, కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం, పందెం జరిగేరోజు, ఆ రోజు నక్షత్రాన్ని బట్టి పందెం కాస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి.
రకరకాల పందేలు..
డింకిని విధానంలో పుంజులకు కాలిగోర్లు ఉండేలా జాగ్రత్త వహిస్తారు. నిర్వాహకులు కోడి కాళ్లకు కత్తులు కట్టరు. ఈ పందెం కనీసం రెండు నుంచి మూడు గంటలు పడుతుంది. ఒప్పందం ప్రకారం ఇరువర్గాల వారు తమతమ కోడి పుంజులను కనిపించకుండా వాటిపై కండువాలు కప్పి ఉంచి పందేలు కాస్తుంటారు. ఈ పందేన్ని ముసుగు పందెం అంటారు. పుంజును చూపించుకుంటూ కాయ్ రాజా.. కాయ్ అంటూ బెట్టింగ్ నిర్ణయించే పందేన్ని చూపుడు పందెం అంటారు. బొమ్మా బొరుసుతోనూ పందేలు నిర్వహిస్తారు. ఈ పద్ధతిలో బొమ్మా బొరుసు ఆధారంగా కోళ్లను బరిలో దించుతారు.