e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఖమ్మం సత్తుపల్లి అభివృద్ధికి రూ.30 కోట్లు

సత్తుపల్లి అభివృద్ధికి రూ.30 కోట్లు

సత్తుపల్లి అభివృద్ధికి రూ.30 కోట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పింది చేస్తారు
ఇళ్లస్థలాల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తాం
మంత్రులు కేటీఆర్‌, వేముల, పువ్వాడ
మున్సిపల్‌ కార్యాలయం ప్రారంభం
సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన

సత్తుపల్లి రూరల్‌, ఏప్రిల్‌ 2: రాజకీయ చరిత్ర కలిగిన సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు సత్తుపల్లి అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని, అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సత్తుపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సత్తుపల్లిలో రూ.3 కోట్లతో నూతనంగా నిర్మించిన మున్సిపల్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

వేంసూరు రోడ్డులోని దోబీఘాట్‌ వద్ద దాతల సహకారంతో ఏర్పాటు చేసిన తెలంగాణ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన మున్సిపల్‌ కార్యాలయ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. సత్తుపల్లి పట్టణంలో ఓ వైపు సింగరేణి వల్ల, మరోవైపు అటవీ భూముల వల్ల నిరుపేదలకు ఇళ్లస్థలాలు లేవని, ఉన్న వాళ్లకు ఇళ్లు కట్టే అవకాశం లేకుండా పోతోందని అన్నారు. 35 ఎకరాల అటవీ భూమి విషయంలో ఫారెస్టు నిబంధనలు మార్పు చేయాల్సి ఉందని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇచ్చేలా చూస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా 12 అవార్డులను దక్కించుకున్నట్లు చెప్పారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గానికి ఓ చరిత్ర ఉందని గుర్తుచేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఖమ్మానికి దీటుగా సత్తుపల్లిని అభివృద్ధి చేసే క్రమంలో మంత్రి కేటీఆర్‌ సహకారం ఎంతో అవసరమని అన్నారు. మున్సిపల్‌ కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో రూ.30 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందుకు మంత్రి కేటీఆర్‌ నిధులు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. స్థానిక వేశ్యకాంతల చెరువు వద్ద ట్యాంక్‌బండ్‌ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.

జర్నలిస్టుల ఇళ్లస్థలాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కేటీఆర్‌ను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. రహదారుల నిర్మాణాలకు సింగరేణి ఇచ్చిన రూ.9 కోట్ల చెక్కును మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎమ్మెల్యే సండ్రకు అందజేశారు. తొలుత హెలీప్యాడ్‌ వద్ద మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌లు పుష్పగుచ్ఛాలు అందించి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, కలెక్టర్‌ కర్ణన్‌, ఆర్డీవో సూర్యనారాయణ, మన్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, కమిషనర్‌ సుజాత, ఎఫ్‌డీవో వేమూరి సతీశ్‌కుమార్‌, ఎంవీఐ దారా మనోహర్‌, ఏసీపీ వెంకటేష్‌, సింగరేణి జీఎం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సత్తుపల్లి అభివృద్ధికి రూ.30 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement