యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసినా.. అన్నదాత కోసం సీఎం కేసీఆర్ ముందుకు రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, రైతులకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో పల్లెపల్లెనా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బుధవారం గ్రామాలు, మండల కేంద్రాల్లోనే కాదు పంట పొలాల్లోనూ కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. ధాన్యం కొనేదిలేదంటూ ధోకా చేసిన మోదీ సర్కారు తీరును ఎండగట్టారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో కొనుగోళ్లకు సంబంధించి నాలుగు జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయగా, క్షేత్రస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 1250కిపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశముండగా, అవసరమైతే మరిన్ని పెంచనున్నారు.
కరీంనగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ): బీజేపీ సర్కారు చేతులెత్తేసిన నేపథ్యంలో.. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం చేసిన ప్రకటనతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. మంగళవారం రాత్రి సంబురాలను చేసుకున్నారు. ఇక బుధవారం పల్లె, పట్న అన్న తేడా లేకుండా అంతటా హోరెత్తించారు. పలుచోట్ల పొలాల్లోనూ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
గట్లపై కేసీఆర్, మంత్రుల కటౌట్లు పెట్టి సంబురాలు చేసుకున్నారు. ‘జై కేసీఆర్’ అంటూ నలుదిక్కులా వినపడేలా నినదించారు. మరోవైపు బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. మోదీ సర్కారు చేతులెత్తేసిందని, బీజేపీ కపట నాటకం బయటపడిందని ధ్వజమెత్తారు. ఇక ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీళ్లు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి.. చివరికి ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంటే.. బీజేపీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నదంటూ ఆగ్రహించారు. వడ్లు కొనలేమని కేంద్రం మొండి చెయ్యి చూపినా.. రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడుతుందని తెలిసినా.. అన్నదాతను కాపాడుకునేందుకు సీఎం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు. తమకు అండగా నిలుస్తున్న ఆ సారు వెంటే ఉంటామని చెబుతున్నారు.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ కొంటామని మంగళవారం ముఖ్యమంత్రి ప్రకటన చేయగా, బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్లు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఫోన్లలో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన కొనేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు, గ్రామాల వారీగా సేకరించిన వరి సాగు విస్తీర్ణం లెక్కల ఆధారంగా ధాన్యం దిగుమతికి ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. దాంతో క్షేత్రస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. గతేడాది యాసంగి కరీంనగర్లో 351 కేంద్రాలను, జగిత్యాలలో 406, పెద్దపల్లిలో 306, రాజన్నసిరిసిల్ల జిలాలో 238 మొత్తంగా 1301 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ యాసంగిలో నాలుగు జిల్లాలో కలిపి ముందస్తుగా 1250కి పైగా కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయా గ్రామాల అవసరాలను బట్టి.. కొనుగోలు కేంద్రాలను పెంచనున్నారు. ఒకటి రెండురోజుల్లోనే ఆయా జిల్లాకేంద్రాల్లో ప్రాథమికంగా కొన్ని కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు.
కరీంనగర్ మండలం దుర్శేడులో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ కటౌట్లను తమ పొలాల్లో ప్రదర్శించి అక్కడే పాలాభిషేకం చేశారు. చెర్ల భూత్కూర్‌లో కేసీఆర్ కటౌట్లకు ధాన్యాభిషేకం చేశారు. వడ్ల రాశులపై కేసీఆర్ కటౌట్లను ప్రదర్శించారు. చామన్‌పల్లిలో పొలాల మధ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గంగాధర మండలం కాసారం, గర్షకుర్తి, రామడుగు మండలం వెలిచాలలోనూ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మానకొండూర్‌తో పాటు సదాశివపల్లి, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి, శంకరపట్నం మండల కేంద్రం, తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం, చిగు రుమామిడి మండలం బొమ్మనపల్లిలో రైతులు సంబురాలు చేసుకుని సీఎం కేసీఆ ర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. వీణవంకలో జమ్మికుంట ఏఎంసీ చైర్మన్ బాలకిషన్ రావు ఆధ్వర్యంలో రైతులు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఇల్లందకుంటలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఇటు సైదాపూర్లోనూ సంబురాలు కొనసాగాయి.
యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా కొనుగోలు చేస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్ నిజమైన రైతు బాంధవుడు. కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం వల్ల ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్రంపై రూ.4 వేల కోట్ల భారం పడుతున్నా.. దళారీ వ్యవస్థ రూపుమాపడం కోసం ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. క్వింటాలుకు రూ.1960 చొప్పున కొనుగోలు చేస్తామని, సొమ్మును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రికి రైతుల పక్షాన కృతజ్ఞతలు. రైతు సంక్షేమ చర్యల వల్ల కోటి ఎరకాల పంట విస్తీర్ణం పెరిగింది., గతంలో కంటే సమృద్ధిగా పంటలు పండుతున్నయ్. నిజానికి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేననీ, కానీ కేంద్రం రైతులకు మొండి చేయి చూపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
– ఓ ప్రకటనలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి (గోదావరిఖని)
యాసంగి ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలె. రాష్ట్ర రైతులను ఆగం చేసిన మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం. నాకున్న ఐదెకరాల భూమిల మూడెకరాలు వరి సాగు చేసిన. వడ్లు ఎవరికి అమ్ముకోవాలో టెన్షన్ పడుతున్న సమయంల ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గొప్ప నిర్ణయం తీసుకున్నరు. రూ.1960 మద్దతు ధర ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. కేసీఆర్‌కు రైతులమంతా రుణపడి ఉంటం.
– భూక్యా శివరాం, భూక్యాతండా (వీర్నపల్లి)
యాసంగి వడ్లు కొంటమని సీఎం కేసీఆర్ సార్ మా రైతులకు ధైర్యం చెప్పిండు. ఇది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నరు. నాకున్న నాలుగెకరాలల్ల వరి సాగు చేసిన. కేంద్ర ప్రభుత్వం కొనేది లేదని చెప్పినంక దిగులు చెందినం. కానీ, సీఎం కేసీఆర్ సార్ ఊళ్లలోనే వడ్లు కొంటమని చెప్పి మా గుండెల్లో ధైర్యం నింపిండు. కేంద్రం చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి రైతులను ఆదుకుంటున్నది.
– దొంతరవేణి శ్రీనివాస్, రైతు, నిమ్మపల్లి (కోనరావుపేట)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రైతులకు ఏమాత్రం లాభం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండగా, కేంద్రం మీటర్లు బిగిస్తామని చెప్పడం సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన కేంద్రం తెలంగాణల యాసంగి పంట కొనేది లేదని తెగేసి చెప్పిన్రు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీతో అన్నదాతలకు అన్యాయమే.. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటదని ప్రకటించిన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచిన్రు.
– బద్దం రాకేశ్‌రెడ్డి, రైతు, కొండ్రికర్ల(మెట్పల్లి రూరల్)
యాసంగి వడ్లు రాష్ట్ర ప్రభుత్వమే కొంటదని ప్రకటించిన సీఎం కేసీఆర్ ముమ్మాటికీ రైతు బాంధవుడు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నరు. కేంద్రం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నది. చేతులెత్తేసి మళ్లీ ఢోకా ఇచ్చింది. మరీ ఇంత మొండివైఖరా..? రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరూ నష్టపోవద్దనే యాసంగిలో ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటుంది.
– చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అసలైన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్. కేంద్రం రాష్ట్ర రైతుల మీద వివక్ష చూపినా.. రాష్ట్ర ఖజానాపై వేలాది కోట్ల రూపాయల భారం పడ్డా.. రైతాంగం నష్టపోతుందని యాసంగి వడ్లను పూర్తిగా కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నరు. ప్రపంచంలో ఎకడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా అమలు చేస్తూ అండగా నిలుస్తున్నరు. వ్యవసాయాన్ని బంగారుమయం చేశారు. కర్షకుడి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నరు.
– ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
నేను మూడున్నరెకరాల్లో వరి పంట సాగు చేసిన. బీజేపోళ్లు బడాయికి వరి ఎయిర్రి కొనుడే అన్నరు. పంట చేతికి వస్తుండగా, రాష్ట్రమే కొనాలని తొండికి దిగిన్రు. కేసీఆర్ సార్ మంచిగనే పోరాటం చేసిండు. కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉండడంతో కేసీఆర్ సార్ రైతుల గురించి ఆలోచించి మేమే కొంటామని దేవుడు లెక్క అభయం ఇచ్చిండు. రైతుల ఉసురు బీజేపోళ్లకు తగులుతది. కేసీఆర్ సారే మొదటి నుంచి రైతులకు మేలు చేస్తుండు, గిప్పుడు కష్టకాలంలో కూడా అండగా ఉంటుండు. రైతులం రుణ పడి ఉంటం.
– బండారి ఐలయ్య, రైతు, కొలనూర్ (ఓదెల)
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్.. ఆయన అనుకున్నడు అంటే కచ్చితంగా సాధించి తీరుతడు. వడ్లు కొనేది లేదని కేంద్రమోళ్లు కొర్రీలు పెడితే పెద్దన్నలా రైతులకు అండగా నేనున్నానంటూ ధాన్యం కొంటామని చెప్పిండు. ఇది ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. నాకున్న ఎకరంల వరి పంటేసిన. ఇప్పుడిక రందీ లేకుంట మద్దతు ధరకు అమ్ముకుంట.. ఏమిచ్చి కేసీఆర్ సారు రుణం తీర్చుకోగలం. ఆయనకు ఓటేయడం తప్ప.. ఆయన మా వెంట ఉంటే మాకు ఎలాంటి ఢోకా లేదు.
– ఆకుల రవీందర్, రైతు, కొత్తపల్లి, (హుజూరాబాద్‌టౌన్)
వడ్లు కొనేది లేదని ప్రధాని మోదీ మా పొట్టకొడితే.. సీఎం కేసీఆర్ సారు ప్రతి గింజా కొంటమని చెప్పి మా కడుపునింపుతున్నడు. బీజేపీ సర్కారు రైతులను ఎప్పుడూ ముంచుడేకాని మేలు చేయలే. మేం మంచిగ బతికితే వాళ్లకు అస్సలు నచ్చుతలేదు. వీళ్లకు మేమే దొరికినమా..? ఎందుకింత పగ? వడ్లు కొనేది లేదని కేంద్రం అంటే మేం చాలా భయపడ్డం. ఈసారి దళారులే మాకు దిక్కు అనుకున్నం. కానీ, సీఎం కేసీఆర్ సార్ పెద్ద మనసు చేసుకుని వడ్లు మొత్తం కొంటమని భరోసా ఇచ్చిండు. మమ్మల్ని మొదటి నుంచి ఆదుకుంటుంది కేసీఆర్ సారే. రైతులంతా ఆయనకు రుణపడి ఉంటం.
– బొల్లి రాజు, రైతు, ధర్మారం మండలం (పెద్దపల్లి జిల్లా)