ఇప్పటి వరకు పట్టణాల్లో అమలు చేస్తున్న టీఎస్ బీపాస్ విధానాన్ని పంచాయతీల్లోనూ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. గత ఏప్రిల్ నుంచే ఆచరణలోకి తెస్తూ పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఆన్లైన్లోనే ఇంటి నిర్మాణానికి అనుమతి లభించనున్నది. ఇన్నాళ్లూ పర్మిషన్ కోసం అధికారుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడ్డ గ్రామీణ జనం ఈ విధానంపై హర్షం వ్యక్తం చేస్తున్నది.
జగిత్యాల, (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల,మే 8 : తెలంగాణ ప్రభుత్వం ఇండ్ల నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు వినూత్నంగా ముందుకెళ్తున్నది. సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. మూడేండ్ల కిందటే పట్టణాలు, నగరాల్లో టీఎస్‌బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ఫర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేష న్ సిస్టమ్)కు అంకురార్పణ చేసింది. తాజాగా, గత నెల నుంచే పంచాయతీల్లోనూ అమలు చే స్తున్నది. ఈవిధానంతో గ్రామాల్లోనూ ఇండ్ల నిర్మాణానికి ఆన్లైన్లోనే అనుమతి లభించనున్నది.
గ్రామాల్లో భవన నిర్మాణాలకు అనుమతినిచ్చేందుకు జీవో నంబర్ 52ని జారీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వర కు ఈ అధికారం పంచాయతీ కార్యదర్శికి ఉండే ది. కార్యదర్శి భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉంటే అనుమతులు జారీ చేసేవారు. అయితే, ఇక నుంచి టీఎస్ బీ పాస్ పద్ధతిలో అనుమతులు తీసుకోవాల్సి ఉం టుంది. ఈ విధానం పట్టణాల్లో విజయవంతం కావడంతో గ్రామాల్లోనూ అమలు చే యాలని నిర్ణయించింది.
భవనాలు, ఇండ్లు నిర్మించుకునే వారు మీ-సేవా కేంద్రాల ద్వారా అన్ని రకాల ధ్రు వీకరణ పత్రాలు, ఇంటి నిర్మాణ పథకం (ప్లాన్) రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లను జత చేసి టీఎస్ బీపాస్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. వీటిని పరిశీలించిన తర్వాత పంచాయతీ కార్యదర్శితోపాటు, నీటిపారుదల శాఖ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఇంటి నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తారు.
యాప్‌లో అప్లోడ్ చేసిన విధంగా నిర్మాణ పథకం, ఇతర సౌకర్యాలు, ధ్రువపత్రాలు ఉన్నా యా? లేవా? అన్న విషయాన్ని నిర్ధారించుకుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే 21 రోజుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తారు. ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఎలాంటి ముంద స్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చివేసే అధికారం పంచాయతీరాజ్ అధికారులకు ఉంటుంది.
ఇప్పటి వరకు గ్రామాల్లో ఇండ్లు, భవన నిర్మాణాల అనుమతి వ్యవహారం సంక్లిష్టంగా ఉండేది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరిగేది. కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది తాయిలాలకు లొంగి రూల్స్‌కు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేవారనే అభిప్రాయం ఉన్నది. నిర్మించిన ఇండ్లకు ఆస్తి విలువను నిర్ధారించే విషయంలోనూ అనేక ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సరైన కొలతలు లెక్కించి రికార్డు చేయకపోవడంతో పంచాయతీలకు రావాల్సిన ఆస్తిపన్ను సైతం సమకూరేదికాదు.
ఈ నేపథ్యంలోనే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, పర్మిషన్ రసుముతో పాటు, ఆస్తి పన్ను నిర్ధారణ, తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని టీఎస్ బీపాస్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా ఇక నిర్మాణాలు సులువుగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని ఇబ్బందులు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పల్లెల్లో ప్రజలు వారసత్వంగా లభించిన స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుంటారు. ఈ స్థలాలకు రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు ఉండవు. అలాగే, టీఎస్‌బీపాస్ చట్టంలో ఎల్ఆర్ఎస్ స్థలాలకు సరైన పన్నులు చెల్లించినవారికి మాత్రమే అనుమతులు వస్తాయి.
ఇప్పటివరకు గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ చెల్లించడంలేదు. ఇక 75 గజాల్లోపు ఇంటి నిర్మాణం ఉంటే, దానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని సాధారణ చట్టం చెబుతున్నది. అయితే, టీఎస్‌బీపాస్‌లో మాత్రం తగిన రుసుం చెల్లించి, దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక 300 గజాల్లోపు నిర్మాణం ఉంటే దీనికి టీఎస్‌బీపాస్‌లో స్వీయ ధ్రువీకరణ పద్ధతిలో అనుమతి పొందడానికి అవకాశం ఉంది.
బహుళ అంతస్తులు, లేదా మూడు వందల గజాల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం చేసుకోవాలని అనుకుంటే టీడీడీసీ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టీఎస్‌బీపాస్‌లో ఇంటి నిర్మాణానికి సంబంధించి, రోడ్ల విస్తరణకు అనుకూలంగా, సెట్‌బ్యాక్‌తో ఇంటి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఉంటేనే అనుమతులు వస్తాయి. ఇంత పకడ్బందీగా ఎల్ఆర్ఎస్, సెట్‌బ్యాక్, రోడ్ల విస్తరణ, రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు, తదితర వివరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడే లభ్యం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
పంచాయతీ పరిధిలో టీఎస్‌బీపాస్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి నిర్మాణాల కోసం తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల్లో టీఎస్ బీపాస్ సైట్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. మండలాలు, గ్రామాల ఆధారంగా సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికే పొందుపర్చిన విలువ ప్రకారం సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా నమోదు చేసుకున్న వాటికి నిబంధనల ప్రకారం అనుమతి లభిస్తుంది. గ్రామ కార్యదర్శులు, డివిజనల్ పంచాయితీ అధికారులకు ఈ విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు.