కోళ్లమద్ది బడి కొత్తందాలు సంతరించుకుంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గివ్ తెలంగాణ ఫౌండేషన్ సహకారంతో మెరుగులుదిద్దుకుంది. సర్పంచ్ ఏనుగు కేశవరావు ప్రత్యేక చొరవతో డీఎమ్ఎఫ్టీ నిధులు రూ.15 లక్షలతో అదనంగా రెండు తరగతి గదులు నిర్మించగా గది గోడలపై రంగు రంగుల బొమ్మలు, అక్షరాలతో చిన్నారులను ఆకట్టుకుంటున్నది. సకల వసతులు సమకూర్చుకొని ఆంగ్ల మాధ్యమానికి ఆహ్వానం పలుకుతున్నది.
– గంభీరావుపేట, ఏప్రిల్ 21
మండలంలోని కోళ్లమద్ది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొత్తందాలు సంతరించుకుంది. అందమైన తరగతి గదులతో ఆకట్టుకుంటున్నది. పాఠశాలలో 6 తరగతి గదులు ఉన్నాయి. గతంలో పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 65కు చేరింది. గ్రామంలో అందరు విద్యార్థులూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు ఉన్నారు, గ్రామ సర్పంచ్ సహకారంతో ముగ్గురు ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించుకుని నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విశాలమైన తరగతి గదులతో ఆదర్శంగా తీర్చిదిద్దారు. సర్పంచ్ ఏనుగు కేశవరావు ప్రత్యేక చొరవతో డీఎమ్ఎఫ్టీ నిధులు రూ.15లక్షలతో అదనంగా రెండు తరగతి గదులు నిర్మించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజన తయారీ కోసం ప్రత్యేక గది నిర్మించారు. దీంతో విద్యార్థులకు సరిపడా గదులతో కోళ్లమద్ది పాఠశాల ఆవరణ విశాలంగా రూపుదిద్దుకుంటుంది.
ప్రభుత్వంతోపాటు దాతల సహకారంతో మా బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నాం. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సహకారంతో యుద్ధప్రాతిపదికన రూ.15 లక్షలతో రెండు అదనపు తరగతి గదులు నిర్మించుకున్నాం. గివ్ తెలంగాణ ఫౌండేషన్ వారి సౌజన్యంతో పాఠశాల భవనంతో పాటు తరగతి గదులపై రంగు రంగుల బొమ్మలను చిత్రీకరించాం. ఆంగ్ల బోధనకు విద్యార్థులను ఆహ్వానించే విధంగా నూతన ఒరవడితో అందంగా తయారు చేసుకున్నాం.
– ఏనుగు కేశవరావు. సర్పంచ్, కోళ్లమద్ది
పాఠశాల ఆవరణతో పాటు అన్ని తరగతి గదులను గివ్ తెలంగాణ ఫౌండేషన్ సహకారంతో రంగు రంగులతో అందంగా తీర్చిదిద్దారు. తరగతి గదులలో వివిధ చిన్నారుల బొమ్మలతో పాటు విద్యా బోధనకు అనుకూలంగా ఏ,బీ,సీ,డీ ఇంగ్లిష్ అక్షరాలు గీశారు. చిన్నారులు తరగతి గదిలోకి వెళ్లగానే ఆంగ్ల విద్యను అభ్యసించేలా చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగనుంది.