కరీం‘నగరం’ మెరుస్తున్నది. ప్రగతి పరుగులు పెడుతున్నది. స్మార్ట్ సిటీలో భాగంగా వీధివీధినా అద్దాల్లాంటి రోడ్లు.. సకల వసతులు, హైమాస్ట్లైట్లతో వెలిగిపోతున్నది. ఇందుకు కలెక్టరేట్ రోడ్డే నిదర్శనంగా నిలుస్తున్నది. విశాలమైన రోడ్డు.. దారి వెంట ఆహ్లాదకరమైన మొక్కలతో కనువిందు చేస్తూనే, కొత్తగా ఏర్పాటు చేసిన లైట్లతో రాత్రి వేళ జిగేల్మంటున్నది.
ల్యాల, ఏప్రిల్ 17: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జ యంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మాల విరమణ కోసం తరలివచ్చిన దీక్షాపరులు, భక్తులతో కొండంతా కాషాయమయమైంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల శ్రీరామ.. జయ రామ.. జయ జయ రామ.. జైశ్రీరాం నామ స్మరణలతో గుట్టంతా మార్మోగింది. ఈ సందర్భంగా శనివారం రాత్రికే దీక్షాపరులు పెద్దసంఖ్యలో కొండగట్టుకు చేరుకున్నారు. గుట్టపైనే నిద్రించి ఆదివారం మధ్యాహ్నం వరకు దీక్షల విరమణ చేశారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. భక్తుల తాకిడి ఆదివారం కూడా కొనసాగింది. ఎక్కడ చూసినా జన సందోహం కనిపించింది. జేఎన్టీయూ నుంచి బొజ్జపోతన వరకు ఏర్పాటు చేసిన మూడు వాహన పార్కింగ్ స్థలాలు, గుట్ట కింది వాహన పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోయింది. నాలుగు రోజుల్లో లక్షకుపైగా దీక్షాపరులు మాల విరమించినట్లు ఆలయ యంత్రాంగం తెలిపింది.
అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం రెండోరోజూ కొనసాగింది. ఆదివారం ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్చార్జి స్థానాచార్యుడు జితేంద్రప్రసాద్ ఉత్సవమూర్తులకు అభిషేకం, హారతి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మల్యాలకు చెందిన మఠమాంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భజన మండలి సభ్యులు పాల్గొని 11సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 10గంటల ప్రాంతలోనూ మరోసారి కొండపైకి వచ్చారు. రద్దీని పరిశీలించి, భక్తులతో మాట్లాడారు.