లింగంపేట, అక్టోబర్ 5 : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఐలాపూర్‌లో ప్రమాదవశాత్తు గ్రామ ఊర చెరువులో ఇద్దరు యువకులు పడి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హనీఫ్(35), లింగంపేటకు చెందిన మంగళి శ్రావణ్ (25) ఇద్దరు స్నేహితులు. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇద్దరు కలిసి సోమవారం గ్రామంలోని చెరువు తూము వద్ద చేపలు పట్టడానికి వెళ్లారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన హనీఫ్ రా త్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో గాలించగా చెరువు కట్ట వద్ద అతని దుస్తులను గుర్తించారు. రాత్రి కావడంతో తిరిగి ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం గజ ఈత గాళ తో గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మహ్మద్ హనీఫ్ భార్య తాహేరా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి సర్కారు దవఖానకు తరలించారు. హనీఫ్‌కు భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిపారు. స్నేహితులు ఇద్దరు చెరువులో పడి మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
గోదావరిలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
నందిపేట్, అక్టోబర్ 5: మండలంలోని ఉమ్మెడ పాత గ్రామం సమీపంలో గోదావరి వంతెన వద్ద నదిలో రెండు రోజుల క్రితం గల్లంతైన కేతురామ్, హీరారామ్ మంగళవారం శవమై తేలారు. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన వీరు నందిపేట్‌లో కిరాణా దుకాణం నడుపుతుంటారు. ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు గోదావరి నదికి వెళ్లి నీటిలో దిగారు. ప్రమాదవశాత్తు నీటిలోకి జారి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. రెండు రోజులుగా జాలర్లు, గజ ఈతగాళ్లతో పోలీసులు గాలించారు. మంగళవారం ఉదయం అన్నారం, సిర్పూర్ గ్రామాల శివారులో నది ఒడ్డున వారి మృతదేహాలు కనిపించగా జాలర్ల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ఎస్సై శోభన్‌బాబు మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు.