యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగిలో 20 నుంచి 30 శాతం వరిసాగును తగ్గించేలా, ఇతర పంటల సాగును పెంచేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనగ, కంది, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, పప్పుధాన్యాలు, ఆరుతడి పంటల సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
కామారెడ్డి, అక్టోబర్ 4 : కామారెడ్డి జిల్లాలో రైతులు వరి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో దిగుబడి సైతం గణనీయంగా పెరుగుతున్నది. దీంతో రాబోయే రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ గందరగోళంగా మారే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ముందస్తుగా అప్రమత్తమయ్యింది. కొనుగోళ్లపై కేంద్రంవిముఖత చూపుతుండడంతో వరి సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. యాసంగిలో వరి వద్దు, ఆరుతడి, పప్పు ధాన్యాల పంటలు సాగు చేద్దాం… లాభాలు సాధిద్దామంటూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తామంటూ చేసిన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లలో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. శనగలు, కందులు, పెసర్లు, నువ్వు లు, పొద్దు తిరుగుడు, పప్పుధాన్యాలు వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలని, ఆరుతడి పంటలను సాగు చేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులను కోరుతున్నారు.
క్లస్టర్లవారీగా అవగాహన తరగతులు…
కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహించారు. వ్యవసా య, ఉద్యానవన, పశు సంవర్ధక, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్ శాఖలు, వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించారు. ఈ సారి వరి సాగులో 20 నుంచి 30 శాతం వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలతో కలిగే లాభాల గురించి రైతులకు వివరిస్తూ గత నెల 30 తేదీ వరకు అవగాహన తరగతులు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలో పంట మార్పిడిపై చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వరి పంటలు పండించిన రైతులకు మార్కెటింగ్‌కు అయ్యే సమస్యలను వివరించారు. కొనుగోళ్లను వచ్చే సీజన్ నుంచి నిలిపివేస్తామనీ కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో తలెత్తే ఇబ్బందులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వానకాలంలో 2లక్షల 18వేల 300 ఎకరాల్లో సాగు…
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వరి సాగు భారీగా పెరిగింది. కామారెడ్డి జిల్లాలో వానకాలంలో సాధారణ వరి విస్తీర్ణం 2లక్షల 18వేల 300 ఎకరాలు కాగా, ప్రస్తుతం 2లక్షల 46వేల 158 ఎకరాల్లో వరిని సాగు చేశా రు. 87,320 ఎకరాల్లో సన్న రకానికి గాను 85,126 ఎకరాల్లో, లక్షా 30వేల 980 ఎకరాలకు గాను లక్షా 61వేల 32 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగైంది. సన్న రకం వరి 130.6 శాతం, దొడ్డురకం 164.7 శాతం ఎక్కువగా సాగైంది. కామారెడ్డి జిల్లా పరిధిలో వరి విస్తీర్ణం వచ్చే యాసంగిలో తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా వారం రోజుల పాటు సదస్సులు నిర్వహించారు. జిల్లాలో బోర్ల కింద వరి సాగును తగ్గించి ఆరుత డి పంటలను సాగు చేయాలని రైతులను కోరుతున్నారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి
కామారెడ్డి జిల్లాలో 1.55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసుకోవాల్సి ఉంది. గత యాసంగిలో 2.46 లక్షల ఎకరాల్లలో, వానకాలంలో 2.74 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తామంటూ చేసిన ప్రకటనల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి. ప్రస్తుతం వరి పండించిన రైతులకు కొనుగోళ్ల సమయంలో తలెత్తే ఇబ్బందులను వివరిస్తున్నాం.
-భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి