
నందిపేట్, అక్టోబర్ 3 : సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్లి ముగ్గురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. తమతో కలిసి వచ్చిన వారంతా చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. తాము నీటిలో నడుస్తున్న ప్రదేశమంతా ఇదే లోతు ఉందనుకొని ముందుకు వెళ్తుండగా పక్కనే గుంత ఉందని పసిగట్టలేకపోయారు. నందిపేట్ మండలం ఉమ్మెడ పాత గ్రామం సమీపంలో గోదావరి వంతెన వద్ద నదిలో ముగ్గురు యువకులు గల్లంతు కాగా స్థానిక యువకులు ఒకరిని కాపాడి ఒడ్డుకు చేర్చగా, మరో ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన యువకులు నందిపేట్లో కిరాణా దుకాణం నడుపుతుంటారు. ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు గోదావరి ఉమ్మెడ వంతెన వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఒడ్డున కూర్చొని తరువాత నీటిలో దిగారు. వంతెన రోడ్డు పక్కన కొంత భాగం రెండు, మూడు అడుగుల లోతులో నీళ్లు ఉంటా యి. అందరూ ఆ నీటిలోకి దిగి సరదాగా అటుఇటు తిరుగుతున్నారు. కొంత ముందుకు వెళ్లిన కేతురామ్ (30), హీరా రామ్ (26), జాన్తారామ్ గల్లంతయ్యా రు. మిగతావారు అరుపులు, కేకలు వేయగా పక్కనే ఉన్న ఉమ్మెడకు చెందిన యువకులు కొట్టుకుపోతున్న జాన్తారామ్ను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అందరూ చూస్తుండగానే కేతురామ్, హీరారామ్ నీటి ప్రవాహం లో కొట్టుకుపోయారు. ఉమ్మెడ గ్రామానికి చెందిన యువకులు బుచ్చ రాజశేఖర్, దూడ సుశాంత్, దమ్ము ప్రశాంత్, రాముడు ముత్యం ఈ నలుగురు సాహసం చేసి నీటిలో దిగడంతో జాన్తారామ్ సురక్షితంగా బయటపడ్డాడు. లోతు సమాంతరంగా ఉందనుకొని పొరబడి ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని గల్లంతైన వారికోసం గాలింపు జరుపుతున్నామని ఎస్సై శోభన్ బాబు తెలిపారు.