నిజాంషుగర్స్ భూముల కబ్జాలను తేల్చేందుకు అధికారుల సమగ్ర సర్వే
అన్యాక్రాంతమైన ఫ్యాక్టరీ భూముల లెక్కలు తీస్తున్న రెవెన్యూ యంత్రాంగం
ఒకప్పుడు 16వేల ఎకరాలు.. విక్రయించగా మిగిలింది 384 ఎకరాలు
అందులోనూ 63 ఎకరాలు తప్ప మిగిలిందంతా కబ్జాలోనే..
బోధన్, సెప్టెంబరు 2: బోధన్‌లోని నిజాంషుగర్స్.. ఒకప్పుడు ఆసియాలోనే అతి పెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరొందిన కార్మాగారం.. కేవలం అది చక్కెరను తయారుచేసే ఫ్యాక్టరీగానే కాకుండా దేశంలో అత్యధికంగా సొంత భూములు కలిగిన పరిశ్రమగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.. 1938లో అప్పటి నిజాం పాలనలో ఇక్కడ నిజాం చక్కెర కార్మాగారం స్థాపించారు. చెరుకును సొంతంగా ఫ్యాక్టరీ యాజమాన్యం పండించుకునేలా చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కర ఫారాల పేరిట వ్యవసాయ భూముల కేటాయింపులు జరిగాయి. శక్కర్‌నగర్‌లోని ఫ్యాక్టరీ ఆస్తులతో కలుపుకొని మొత్తం 16,395 ఎకరాల భూములు ఉండేవి. బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని తదితర మండలాల్లో విస్తరించిన 16 ఫారాల్లో చెరుకు పంటను సాగుచేస్తూ.. అ పంటను లైట్ రైల్వేల ద్వారా ఫ్యాక్టరీకి సరఫరా చేసేవారు.. నిజాంషుగర్స్ సమైక్యాంధ్ర పాలనలో నష్టాల పాలయ్యింది. 1996లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చెరుకు ప్లాంటేషన్స్‌ను మూసివేసింది. చివరికి 2002లో ఏకంగా నిజాంషుగర్స్ ఫ్యాక్టరీనే ప్రైవేటుపరం చేసింది. నిజాంషుగర్స్ భూముల్లో చాలావరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు పేదల కోసం కొనుగోలుచేయగా, వందలాది ఎకరాలకు వేలం రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం కావడంతో భూముల ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. సరైన అజమాయిషీ లేకపోవడంతో నిజాంషుగర్స్ భూములకు రక్షణ లేకుండాపోయింది.
కేటాయింపులు ఇలా..
1996లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు చెరుకు ప్లాంటేషన్స్‌ను మూసివేసిన తర్వాత ప్రభుత్వం భూములను విక్రయించడం ప్రారంభించింది. ప్రధాన రహదారుల పక్కన విలువైన భూములను నాటి చంద్రబాబు ప్రభుత్వం వేలం పాటల్లో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించింది. అనంతరం పేదలకు భూమి పంపిణీ పేరిట ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు భూమి కొనుగోలు పథకం కింద నిజాంషుగర్స్ నుంచి సుమారు 7 వేల ఎకరాల మేరకు కొనుగోలుచేశాయి. ఆయా ఫారాల్లోని భూములను సంబంధిత గ్రామ పంచాయతీలకు కొంతమేర కేటాయించారు. నిజాంషుగర్స్ కార్మికులకు కూడా కొంతమేర భూముల పంపిణీ జరిగింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిజాంషుగర్స్ భూములను గురుకులాలు, డబుల్ బెడ్ రూమ్‌లు, శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఇతరత్రా అభివృద్ధి పనుల నిర్మాణాలకు కొంతమేర కేటాయించింది.
ఇంకా ఉండాల్సిన వందలాది ఎకరాల లెక్క మాత్రం తేలడంలేదు. నిజాంషుగర్స్ ప్రైవేటు యాజమాన్యం డెల్టా పేపర్ మిల్స్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా మారడంతో ఫ్యాక్టరీ పేరు నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)గా మారింది. ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల ఆస్తులను జాయింట్ వెంచర్ ఆస్తులుగా ఉంచారు. కాగా, మిగిలిన వ్యవసాయ భూములు, ఆస్తులపై ప్రైవేటు యాజమాన్యానికి ఎలాంటి హక్కు లేకుండా.. నిజాంషుగర్స్ కోర్ కమిటీని ఏర్పాటుచేసి వాటి పర్యవేక్షణను ఆ కమిటీకి అప్పగించారు.
మిగిలిన 384 ఎకరాలు కూడా రికార్డుల్లోనే..
నిజాంషుగర్స్ ప్రైవేట్ యాజమాన్యం పరిధిలోకి వెళ్లిన అనంతరం ఫ్యాక్టరీ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఆధీనంలో ఏర్పడిన కోర్ కమిటీ సైతం భూముల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ కోర్ కమిటీలో ప్రస్తుతం ఇద్దరే ఉద్యోగులు ఉండడం గమనార్హం. దీంతో నిజాంషుగర్స్ వ్యవసాయ భూముల లెక్కలు తీసే పనిలోకి రెవెన్యూశాఖ దిగింది. అన్ని కేటాయింపులు పోనూ.. ఇంకా 700 ఎకరాలు ఉన్నట్లు కొంత కాలంకిందట భావించారు. ఇప్పుడు తాజాగా నిజాంషుగర్స్‌కు కేవలం 384 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తేలింది. ఈ 384 ఎకరాలు కూడా కేవలం రికార్డుల్లోనే ఉండడం గమనార్హం. మొత్తం 384 ఎకరాల్లో ప్రస్తుతం బోధన్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన నర్సాపూర్, ఆచన్‌పల్లి విలీన గ్రామాల పరిధిలో కేవలం 63 ఎకరాలే కనిపిస్తున్నాయి. మిగతా భూమంతా ఆక్రమణల్లో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. శక్కర్‌నగర్ కాలనీలోని భూముల్లో కొంతమేరకు బృహత్ ప్రకృతివనం, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ యార్డు, స్టేడియం తదితర అవసరాల కోసం కేటాయించారు. సర్వే పూర్తయితే.. కబ్జాదారులు, ఆక్రమణదారుల వివరాలు బయటికి వస్తాయి.
కొనసాగుతున్న నిజాంషుగర్స్ భూముల సర్వే..
కోట్లాది రూపాయల విలువైన నిజాంషుగర్స్ భూముల ఆక్రమణలు, కబ్జాలకు అడ్డుకట్ట వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి నెలలో కలెక్టర్ నారాయణరెడ్డి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ(ఎన్డీఎఎస్ఎల్)ని సందర్శించారు. శక్కర్‌నగర్ కాలనీలోని నిజాంషుగర్స్ ఆస్తుల వివరాలతో పాటు డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీ భూములపై ఆరా తీశారు. రికార్డుల్లో ఫ్యాక్టరీ పేరిట నమోదైన ఆస్తులకు, భౌతికంగా నిజాం షుగర్స్ కోర్ కమిటీ ఆధీనంలో కనిపిస్తున్న భూములకు తేడా ఉండడం తో.. ఫ్యాక్టరీకి అసలు ఎంత భూమి ఉండేది..? అధికారికంగా అమ్మిన భూములెంత.? కార్పొరేషన్ల ద్వారా పేదలకు పంచిన భూమి ఎంత..?.. ఇంకా మిగిలినది ఎంత..? అన్న లెక్కలు తీయాలని ఆదేశించారు. దీంతో నిజాంషుగర్స్ కోర్ కమిటీ, రెవెన్యూశాఖ సర్వే ప్రారంభించాయి. కోటగిరి మండలంలో సర్వే పూర్తవగా.. మిగతా మండలాల్లో కొనసాగుతున్నది..
కబ్జాలను గుర్తించేందుకు సర్వే చేస్తున్నాం..
కలెక్టర్ ఆదేశాల మేరకు నిజాంషుగర్స్‌కు సంబంధించిన భూములపై సమగ్ర సర్వే చేపట్టాం.. ఇప్పటికే, కోటగిరి మండలంలో సర్వే పూర్తవగా, మిగతా మండలాల్లో కొనసాగుతున్నది. నిజాంషుగర్స్ కోర్ కమిటీ వద్ద ఉన్న లెక్కల ప్రకారం.. ఇంకా 384 ఎకరాల భూమి ఉండాలి. భూములు ఎక్కడెక్కడ.. ఎవరెవరూ కబ్జా చేశారో తేల్చే పనిలో ఉన్నాం. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటాం.