కామారెడ్డి, సెప్టెంబర్ 30 : సమైక్య పాలనలో అస్తిత్వం కోల్పోయిన బతుకమ్మ పండుగకు కేసీఆర్ ప్రభుత్వం గుర్తింపు తీసుకువచ్చింది. రాష్టం వచ్చాక ప్రతీ ఏడాది నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వమే అధికారికంగా పండుగను నిర్వహిస్తుంది. ముఖ్యంగా అడపడుచులకు ప్రభుత్వ కానుకగా చీరలను పంపిణీ అందిస్తుండగా.. ఈనెల 2 నుంచి జిల్లాలో పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న అర్హులైన మహిళలందరికీ వివిధ రంగుల్లో చీరలను కానుకగా అందిస్తూ, పరోక్షంగా చేనేత కార్మికులకు చేయూతనిస్తున్నది.ఈ ఏడాది గతంలో కన్నా భిన్నంగా వివిధ రకాల రంగుల్లో బతుకమ్మ చీరలను పంపిణీకి చర్యలు చేపట్టింది. బంగారు,, వెండి జరి అంచులతో తయారు చేసిన చీరలు జిల్లాకు చేరుకున్నాయి. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 2 నుంచి పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులతో నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు 85శాతానికి పైగా చీరలు చేరుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో 3లక్షల 17 వేల చీరలు పంపిణీ చేయాల్సి ఉండగా, గోదాములకు 2లక్షల 79వేల చీరలు చేరుకున్నాయి. ఈ నెల 6 నుంచి ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభంకానుండగా, మొదటివారంలోనే పూర్తి స్ధాయిలో చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులను 22మండలాలకు నోడల్ అధికారులుగా నియమించారు. కామారెడ్డిలో అత్యధికంగా 38,488 మంది లబ్ధిదారులు ఉండగా, పెద్ద కొడప్గల్ మండలంలో అత్యల్పంగా 6,089 లబ్ధిదారులు ఉన్నారు.
సమన్వయంతో పంపిణీ
బతుకమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రధానంగా సివిల్ సప్లయ్, ఐకేపీ, గ్రామీణాభివృద్ధి, మెప్మా, రెవెన్యూ, రేషన్ డీలర్స్, పంచాయతీ, మున్సిపల్, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ సహకారంతో చీరలను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డులో పేరు ఉంటేనే ఆధార్‌కార్డు నిర్ధారణతో చీరలను పంపిణీ చేయనున్నారు. జిల్లాస్థాయిలో గ్రామీణాభివృద్ధి, చేనేత, జౌళి శాఖలు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, గ్రామస్థాయిలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు. మున్సిపాలిటీలో పరిధిలో కమిషనర్లు, మెప్మా, ఐకేపీ ఉద్యోగుల సహకారంతో పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా బతుకమ్మ చీరల వివరాలు
బాన్సువాడలో 20,622, భిక్కనూర్ 16,264, బీబీపేట 9,024, బిచ్కుంద 17,332, బీర్కూర్ 7,976, దోమకొండ 10,365, గాంధారి 16,287, జుక్కల్ 14,193, కామారెడ్డి 38,488, లింగంపేట 17,153,మాచారెడ్డి 15,654, మద్నూర్ 18,590, నాగిరెడ్డిపేట 11,814, నస్రుల్లాబాద్ 8,780, నిజాం సాగర్ 11,961, పెద్దకొడప్గల్ 6,086, పిట్లం 14,860, రాజంపేట 9,421, రామారెడ్డి 12,340, సదాశివనగర్ 14,439, తాడ్వాయి 10,997, ఎల్లారెడ్డి 14, 353.