కోరుట్ల, జనవరి 19: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడపడుచులకు వరంలా మారాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన 158 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 1,58,18,328 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమానికి ఆధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రపంచ దేశాలు హర్షించేలా అనేక ప్రతిష్టాత్మక పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికి నేరుగా వచ్చి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాల్లో కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు చెక్కులను అందించనున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, జిల్లా సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.