జమ్మికుంట, మార్చి31: టీఆర్ఎస్ పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగిందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆర్యవైశ్యులను ఏ పార్టీ పట్టించుకున్న పాపానపోలేదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రకటన రానున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కేటాయించి కమ్యూనిటీ భవనాలు నిర్మించి ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు చందా రాజుతో పాటు కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్ర పరిశ్రమల సంస్థ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కోలేటి మాట్లాడారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. కులస్తులందరూ ఐక్యంగా ముందుకెళ్లి హక్కులను సాధించుకోవాలన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆర్యవైశ్య సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. సర్కారు దృష్టికి తీసుకెళ్లి నిరుపేద ఆర్యవైశ్యులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని అమరవాది లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వర్ రావు, రాధిక, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు అనుగం శ్రీనివాస్, శివనాథుని శ్రీనివాస్, పుప్పల రమేశ్, శారద, వెంకటేశం, రాజేంద్రప్రసాద్, సతీశ్, రమేశ్, ఆంజనేయులు, కైలాస్, భాస్కర్, మురళి, రవికుమార్, అర్చన, రాణి, గీత, మహేశ్, భాస్కర్, లావణ్య, మాధవి, రాజు, రమాదేవి, రామకృష్ణ, రాజన్న, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.