గుమ్మడిదల/ హత్నూర, ఏప్రిల్ 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జంగల్ బచావో.. జంగల్ బడావో’పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని రాష్ట్ర అటవీశాఖ ఐఎఫ్ఎస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని గమ్మడిదల మండలం బొంతపల్లిలో అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు, హత్నూర మండల పరిధిలోని శేర్కాన్‌పల్లి శివారులోని అటవీప్రాంతాన్ని ఆయన సందర్శించారు. వీరితో పాటు ఐఏఎస్, పీడీ, ఓఆర్డీ, హెచ్ఎండీఏ అధికారి సంతోష్‌కుమార్, ఐఎఫ్ఎస్, డైరెక్టర్ అర్బన్‌పార్కు హెచ్ఎండీఏ ప్రభాకర్, ఐఎఫ్ఎస్ సరవన్, డీఎఫ్‌వో వెంకటేశ్వర్రావు, ఎఫ్ఆర్వో వీరేంద్రబాబు, హెచ్ఎండీఏ ఫారెస్ట్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ ఐఎఫ్ఎస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అర్బన్ పార్కులో ఎత్తైన టవర్‌పై అటవీశాఖ అధికారులకు అడవిని చూపిస్తూ అధికారులకు పచ్చదనం, పర్యావరణంపై అవగాహన కలిగించారు. అడవులను దట్టంగా మార్చడానికి మొక్కలను నాటాలని సూచించారు. అర్బన్ పార్కులు ఎడ్యుకేషన్ హబ్‌గా మారాలన్నారు. విజిటర్స్ జోన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 76వేల ఎకరాల్లో 109 అర్బన్ పార్కులు వెలిశాయన్నారు. 70 ఆక్సిజన్ పార్కులు ఉన్నాయన్నారు. వీటికోసం లక్ష 76 వేల ఎకరాలు కేటాయించామన్నారు. హెచ్ఎండీఏ నిధులతో వీటిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి అర్బన్ పార్కుతో అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అడవుల చుట్టూ పెన్సింగ్ వేసి, కందకాలు తీసి అక్రమంగా కల్పను రవాణా చేయకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో వన్య ప్రాణుల రక్షణకు సాసర్ ఫిట్స్‌ను ఏ ర్పాటు చేసి వాటిలో నీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అడవులను రక్షించడం వల్ల పర్యావరణా న్ని రక్షించడానికి అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ పార్కులను తీర్చిదిద్దడానికి నిధులు కేటాయిస్తూ వాటి రక్షణకు కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా అర్బన్ పార్కులను, అడవులను రక్షించడానికి కృషి చేయాలని కోరారు. వీరితో పాటు గుమ్మడిదల అటవీశాఖ అధికారులు మంజిత్ సింగ్, సిబ్బంది ఉన్నారు. అనంతరం హత్నూర మండలంలో పర్యటించిన అధికారులు రొయ్యపల్లి, శేర్కాన్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. వారివెంట సీసీఎఫ్ శర్వానంద్, డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు, ఎఫ్ఆర్వో వీరేంద్ర, సర్పంచ్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.