అయిజ, ఆగస్టు 13 : ఆర్డీఎస్కు మహర్దశ పట్టనున్నది. ప్రధాన కాలువ మరమ్మతు పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాలువ మరమ్మతులకు నోచుకోక నీటి విడుదలకు ఇబ్బందులు కలుగుతుండటంతో ఎమ్మెల్యే అబ్రహం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల కాలువ నిండుగా ప్రవహిస్తుండడంతో అక్కడక్కడ తెగి నీరు వృథాగా పోతుందని సీఎం కేసీఆర్, జలవనరుల శాఖకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆర్డీఎస్ కాల్వతో పాటు డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులు చేపట్టేందుకు సన్నద్ధమైనది. రూ.13.54 కో ట్లు విడుదల చేస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్ శుక్రవారం జీవో నం.318 జారీ చేశారని ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. 68.400 కి.మీ. నుంచి 142 కి.మీ. మధ్య నాలుగు విభాగాల్లో పనులు జరగనున్నాయి. ఇందు లో భాగంగా కాల్వ లైనింగ్, డీ-40 మరమ్మతులకు రూ.9.24 కోట్లు, డీ-29 డిస్ట్రిబ్యూటరీ రూ.2.31 కోట్లు, డీ-38, 38 ఏ, 39 డిస్ట్రిబ్యూటరీల మరమ్మతులకు రూ.88 లక్షలు, డీ-30వ డిస్ట్రిబ్యూటరీ మరమ్మతుకు రూ.1.09 కోట్లు విడుదల చేసినట్లు ఈఈ పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.