ఒక్కో కుటుంబానికి 250గజాల స్థలం : ఎంపీ రాములు, ఎమ్మెల్యే మర్రి
వట్టెం రిజర్వాయర్ నిర్వాసితుల ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ
బిజినేపల్లి, ఆగస్టు29: వెంకటాద్రి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించే బాధ్యత తనదని ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వట్టెం గ్రామ శివారులో వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రాములు, జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి, కలెక్టర్ మనూచౌదరితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ భూములు, ఇండ్లు సర్వం కోల్పోయి లక్షలాది మంది రైతులకు సాగునీరు ఇచ్చేందుకు పెద్ద మనస్సుతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సహకరించిన రాంరెడ్డిపల్లి, అనెకాన్పల్లితండా, కార్కొండతండా, అనెకాన్పల్లి, జీగుట్టతండా, పుల్లగిరి ప్రజలు దేవుళ్లతో సమానమన్నారు. వెంకటాద్రి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో తమ భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికే మంచి ప్యాకేజీ మంజూరు చేశామన్నారు. పునరావాసానికి ఒక్కొక్కరికి 250గజాల స్థలాన్ని త్వరలోనే లాటరీ పద్ధతిన కేటాయిస్తామన్నారు. ఇందుకు రూ.24కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఆరు నెలల్లో వాస్తు ప్రకారంగా అన్ని సౌకర్యాలు పూర్తి చేయిస్తామన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ తాము సర్వం కోల్పోయిన లక్షలాది మందికి వెలుగునిచ్చేందుకు ముందుకొచ్చిన భూనిర్వాసితులకు కృతజ్ఞతలు తెలిపారు. భూత్పూర్ నుంచి అమ్రాబాద్ వరకు జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ప్రభుత్వం మంజూరు చేస్తే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందన్నారు. మార్కండేయ రిజర్వాయర్ పూర్తి చేసుకుంటే జిల్లాలో ప్రతి సెంటు భూమి సాగునీరుతో తడుస్తుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తుందన్నారు. దళితబంధు పథకం ద్వారా అణగారిన వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ నిర్వాసితులకు ఉపాధి, పునరావాసం కింద అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు సర్పంచ్ రమణి బాధ్యతలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కారఘునందన్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ హనుమంతురావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీలు హరిచరణ్‌రెడ్డి, భరత్, ఆర్డీవో నాగలక్ష్మి, తాసిల్దార్ అంజిరెడ్డి, సర్పంచ్ రమణిరాము, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, అమృత్‌రెడ్డి, లక్ష్మిశ్రీధర్రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహారెడ్డి ఉన్నారు.