రథంపై ఊరేగిన శ్రీదేవీ, భూదేవీసమేత ధన్వంతరి వేంకటేశ్వరస్వామి
అయిజ, ఆగస్టు 22 : మండలంలోని ఉత్తనూరు గ్రామంలో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో మూల విగ్రహంతోపాటు జనార్దనస్వామి, లక్ష్మీదేవిలకు అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి వేద పండితులు కల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీవారిని రథంపై ఆసీనులను చేసి గ్రామంలోని వీధుల గుండా భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఊరేగించారు. గ్రామంలోని దశమి కట్ట వరకు రథోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందజేశారు.
ఆదిశిలాక్షేత్రంలో..
మల్దకల్, ఆగస్టు 22 : ఆదిశిలాక్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా భూలక్ష్మీ, శ్రీదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం ఎంతో కమనీయంగా సాగింది. ఆలయ అర్చకులు రమేశాచారి, మధుసూదనాచారి, నాగరాజాచారి ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య స్వామివారి కల్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. భక్తులకు అలయాధికారులు అన్ని వసతులు కల్పించారు.